హైదరాబాద్‌లో ప్రభాస్ కొత్త డ్రీమ్ హౌస్.. ఖరీదు ఎన్ని కోట్లో తెలుసా?
పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, నాగ్ అశ్విన్‌తో కల్కి 2, హను రాఘవపూడితో ఫౌజీ సినిమాలలో నటిస్తున్నారు. స్పిరిట్, కల్కి 2ను సమాంతరంగా చేస్తూ వస్తున్న ప్రభాస్.. ఈ రెండింటిలో ఒకటి త్వరగా పూర్తి చేసి ఫౌజీ సెట్‌లో దిగిపోవాలని ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్. ఈ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2ను సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నారు ప్రభాస్.
ప్రజెంట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ దరిదాపుల్లో ఏ హీరో కూడా లేరు. భారత్‌లో 6 సినిమాలకు 6 సార్లు 100 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టిన ఏకైక హీరోగా నిలిచారు. డివైడ్ టాక్‌తోనూ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన నటుడు ప్రభాస్ ఒక్కరే. తన రాబోయే సినిమాలు స్పిరిట్, కల్కి 2, ఫౌజీ చిత్రాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బాహుబలితో తెలుగు సినిమా స్థితిని, గతిని మార్చిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించారు. ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బడా నిర్మాతలు క్యూకడుతున్నారు. సినిమాకు 150 నుంచి 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు ప్రభాస్. ఆయన మార్కెట్, క్రేజ్ దృష్ట్యా ఎంత కావాలన్నా ఇచ్చే వారు ఎందరో.
ప్రభాస్‌కు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులున్నాయి. ఇటలీలోనూ ఆయనకు ఖరీదైన విల్లా ఉంది. ప్రభాస్ ఆస్తుల విలువ 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సినిమాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ఇతర మార్గాల ద్వారా బాగానే సంపాదిస్తున్నారు ప్రభాస్. తన సంపాదనను రియల్ ఎస్టేట్, ఇతర పెట్టుబడుల్లోకి మళ్లిస్తున్నారు. ప్రభాస్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఖరీదైన బంగ్లా ఉంది.
ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా తన క్రేజ్ పెరిగిన నేపథ్యంలో తన రేంజ్‌కి తగినట్లుగా మరో కొత్త ఇల్లు నిర్మించుకోవాలని ప్రభాస్ భావిస్తున్నట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో తన డ్రీమ్ మ్యాన్షన్ నిర్మించనున్నారట. ఐటీ, ఫార్మా, ఇతర కార్పోరేట్ కంపెనీలకు నెలవైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో రెండు ఎకరాల స్థలాన్ని ప్రభాస్ ఇప్పటికే కొనుగోలు చేశారట.
ఆ ప్రాంతంలో ఎకరం అక్షరాల 80 కోట్ల రూపాయలు.. అంటే కేవలం స్థలం ఖరీదే 160 కోట్ల రూపాయలు. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్‌కు సమీపంలో ప్రభాస్ డ్రీమ్ హౌస్ నిర్మించే ప్రదేశం ఉండటంతో ఇక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ సహా నగరంలోని ఏ ప్రాంతానికైనా సులభంగా ప్రభాస్ చేరుకోవచ్చు. ఈ డ్రీమ్ మాన్షన్‌లో అత్యాధునిక వసతులు ఉంటాయని చెబుతున్నారు.
జిమ్, హోమ్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్‌తో పాటు మరెన్నో లగ్జరీ సౌకర్యాలు ఉంటాయట. ఇక ఇంటి లోపల తన అభిరుచికి తగినట్లుగా ఇంటీరియర్‌ను ప్లాన్ చేశారట డార్లింగ్. ఈ డ్రీమ్ హౌస్ పూర్తి కావడానికి తక్కువలో తక్కువ రెండేళ్లు సమయం పడుతుందుని వార్తలు వస్తున్నాయి. స్థలం ఖర్చు, నిర్మాణంతో కలిపి ప్రభాస్ డ్రీమ్ మ్యాన్షన్ ఖరీదు 200 కోట్లను దాటేస్తుందని చెబుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
.jpg)
Comments
Post a Comment