లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

భారతీయ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. విలక్షణ సినిమాలను అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే చిత్రీకరించి శెభాష్ అనిపించుకున్నారు సింగీతం. ఇటీవల 94 ఏళ్ల వయసులోనూ సింగ్ గీతం అనే సినిమాకు దర్శకత్వం వహించి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. వయోభారంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు సింగీతం శ్రీనివాసరావు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది. 

సింగీతం శ్రీనివాసరావు ప్రస్థానం

1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా గూడూరులో జన్మించారు సింగీతం శ్రీనివాసరావు. చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ ప్రోత్సాహంతో నాటక రంగంలోకి ప్రవేశించారు. కొంతకాలం పాటు సూళ్లూరుపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అయితే నటనపై ఆసక్తితో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూసేవారు. 1960లో లక్ష్మీ కళ్యాణిని పెళ్లారు. భార్య పేరుతో శ్రీ కళ్యాణీయం అనే పుస్తకం రాశారు. 2022లో అనారోగ్యం కారణంగా లక్ష్మీ కళ్యాణి కన్నుమూశారు. 

దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డి వద్ద అప్రెంటీస్‌గా జాయిన్ అయిన సింగీతం.. దొంగరాముడు, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, మాయబజార్, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం తదితర సినిమాలకు పనిచేశారు. 1972లో నీతి నిజాయితీ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. తర్వాత అమెరికా అమ్మాయి, తరం మారింది, పంతులమ్మ, సొమ్మొకడిది సోకోకడిది, మయూరి, అమెరికా అబ్బాయి, ఆదిత్య 369, బృందావనం, భైరవ ద్వీపం, మేడం, ఆకాశవీధిలో, విచిత్ర సోదరులు వంటి సినిమాలను తెరకెక్కించి వినూత్న కథలకు కేరాఫ్‌గా నిలిచారు. 

సినిమాకు దర్శకత్వంతో పాటు స్క్రీన్ ప్లే, నిర్మాణం, సంగీతం, నటన, రచన ఇలా అనేక రంగాల్లో తనదైన ముద్రవేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో ఈ ఏడాది సింగ్ గీతం అనే సినిమాకు దర్శకత్వం వహించి.. పెద్ద వయసులో దర్శకత్వం వహించిన అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 

భారతీయ సినిమాకు అందించిన సేవలకు గాను రెండు జాతీయ చలన చిత్ర అవార్డులు, ఐదు నంది అవార్డులు, మూడు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సహా అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. 2011లో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా .. లైఫ్ టైం అచీవ్‌మెంట్ పురస్కారంతో సింగీతం శ్రీనివాసరావుని గౌరవించింది. సింగీతం శ్రీనివాసరావు మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.



బాలాపూర్ లడ్డూకు రికార్డ్ ధర.. ఈసారి ఎంత పలికిందంటే?

 


హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఖైరతాబాద్ మహాగణపతితో పాటు నగరంలో వాడవాడలా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణపయ్య .. గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. గణేష్ శోభాయాత్రను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు దగ్గరుండి యాత్రను పర్యవేక్షిస్తున్నారు. 

ఇదిలాఉండగా.. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాట ఈసారి కూడా ఆసక్తిగా సాగింది. ఈసారి 8 మంది ఈ లడ్డూని సొంతం చేసుకోవడానికి పోటీ పడగా.. సామ ప్రణీత్ రెడ్డి అనే భక్తుడు ఏకంగా 39 లక్షల రూపాయలకు ఈ లడ్డూను సొంతం చేసుకోవడం విశేషం. గతేడాది 35 లక్షల రూపాయలకు ఈ లడ్డూను  లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. 


తొలిరోజే టాస్క్‌లతో రణరంగంలా బిగ్‌బాస్ 10.. మేజిక్‌ కీలను గెలుచుకున్నదెవరు?

 


బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఘనంగా ప్రారంభమైంది. 10 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ కలిపి మొత్తం 16 మంది ఈసారి కంటెస్టెంట్స్‌గా హౌస్‌లో అడుగుపెట్టారు. సెలబ్రిటీ కేటగిరీలో దేబ్‌జనీ మోదక్, టెంపర్ వంశీ, కృష్ణుడు, చైత్రా రాయ్, ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ నరేష్, త్రిగుణ్, సుధీర్ రెడ్డి, వర్షిణి సౌందరరాజన్, ముఖేష్‌ గౌడలు కంటెస్టెంట్స్‌గా వచ్చారు. ఇక కామనర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా అగ్నిపరీక్ష సీజన్ 2లో ఫైనల్ లిస్టులో చేరిన 13 మందిలో 6గురిని హౌస్‌లోకి పంపారు. వారు సింగర్ ఝాన్సీ, అమన్, చరణ్, సృష్టి, షాలిని, రోహిత్‌. 

ప్రతి సీజన్‌లోనూ కంటెస్టెంట్స్ అంతా వచ్చిన తర్వాత రెండో రోజు నుంచి టాస్క్‌లు మొదలవుతాయి. కానీ ఈ సీజన్‌లో మాత్రం లాంచింగ్ ఎపిసోడ్ రోజునే టాస్క్‌లు మొదలెట్టారు కింగ్ అక్కినేని నాగార్జున. దీనిలో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌ చూపించడానికి వెళ్లిన నాగ్.. తనతో పాటు గార్డెన్ ఏరియా మాదిరిగా ఉన్న రూమ్‌లోకి ఓ కీని పట్టుకుని వెళ్లారు. ఈసారి ఆట మొత్తం ఈ మేజిక్ కీతోనే ఉందని చెప్పిన ఆయన 10 బాక్స్‌లు చూపించారు. ఇందులో ఓ బాక్స్‌ను తన దగ్గరున్న కీతో ఓపెన్ చేయగా అందులో ఈ కీ ల గురించి, ఈ బాక్స్‌లు ఓపెన్ చేయడం వల్ల వచ్చే పవర్స్ గురించి చదివి వినిపించారు. 

ఆ తర్వాత హౌస్‌లోకి వచ్చిన తొలి నలుగురు కంటెస్టెంట్స్‌ దేబ్‌జనీ మోదక్, త్రిగుణ్, సుధీర్ రెడ్డి, సింగర్ ఝాన్సీలను గార్డెన్ ఏరియాకి పిలిపించి వారికి మేజిక్ కీ గురించి చెప్పి టాస్క్ ఇచ్చారు. 

దీని ప్రకారం వారి ఎదురుగా డైమండ్ షేపులో ఉన్న పజిల్, బాక్స్‌ పెట్టారు. బజర్ మోగగానే వారి ముందున్న బాక్స్‌లు పగలగొట్టి వాటి ఉన్న బిగ్‌బాస్ 10 అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉన్న బాక్స్‌లను తీసుకోవాలి. వాటిని డైమండ్ షేపులో సరిగ్గా అమర్చాలి. బజర్ మోగే లోగా ఎవరైతే ఫస్ట్ పూర్తి చేస్తారో వాళ్లకి కీ దొరుకుతుంది. ఈ టాస్క్‌లో తొలుత త్రిగుణ్ గెలవగా.. ఆ తర్వాత సింగర్ ఝాన్సీ గెలిచి కీని సొంతం చేసుకుంది. 

ఆ తర్వాత హౌస్‌లోకి వచ్చిన మరో నలుగురు కంటెస్టెంట్స్ చైత్రారాయ్, ఆటో రాంప్రసాద్, శాలిని, అమన్‌లకు కూడా కీ టాస్క్ పెట్టారు. అయితే అమన్‌కు అంతకుముందు నాగార్జున ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేయకపోవడంతో అతనిని ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్లు కింగ్ ప్రకటించారు. ఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్ ముందు రంధ్రాలున్న బోర్డ్ పెట్టి వాటిలో నుంచి బంతిని అందుకుంటూ ఒక బాక్స్‌లో వేయాలి. ఎవరైతే ముందుగా పడేస్తారో వారికే మేజిక్ కీలు దొరుకుతాయి. ఈ టాస్క్‌లో రాంప్రసాద్, షాలినీలు గెలిచి కీలు సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత వంశీ, చరణ్, సృష్టి, పొట్టి నరేష్‌ల ముందు గోల్డెన్ ఎగ్స్ పెట్టి ఒక్కొక్కరితో వాటిని పగలగొట్టారు. వారిలో చరణ్, సృష్టిలకు ఉడకబెట్టిన గుడ్డులు వస్తాయి. దాంతో నరేశ్, వంశీలలో ఒకరిని తమతో పాటు టాస్క్‌కి తీసుకెళ్లాలని నాగార్జున చెప్పారు. దాంతో వారిద్దరూ ఆలోచించుకుని నరేశ్ అయితే తమకు పోటీ ఉండరు అనుకుని అతనిని సెలెక్ట్ చేసుకున్నారు. అనంతరం గార్డెన్ ఏరియాకు ముగ్గురిని పిలిచి వారికి ఓ ఐరన్ రాడ్ తిప్పి దాని కిందపడే రింగులను, ఎదురుగా ఉన్న మూడు హుక్స్‌పై కరెక్ట్‌గా పడేలా వేయాలని టాస్క్ పెట్టారు. ఈ టాస్క్‌లో సృష్టి, పొట్టి నరేశ్‌లు గెలిచి కీలు సొంతం చేసుకున్నారు. 

అయితే చివరిలో వచ్చిన వర్షిణి సౌందరాజన్, కృష్ణుడు, ముఖేష్ గౌడ, రోహిత్‌లకు మేజిక్ కీ గెలుచుకునే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌కు వంశీ సంచాలక్‌గా వ్యవహరించారు. టాస్క్‌లో భాగంగా ఒక రింగ్‌కు అటు ఇటూ తాళ్లు కట్టి ఉంటాయి. వాటిని ఇద్దరు పట్టుకుని మధ్యలో బంతిని పెట్టి దానిని నెట్‌లో వేయాలి.. బజర్ మోగేసరికి ఎవరు ఎక్కువ బంతులు వేస్తారో వారు గెలిచినట్లు అని వంశీ చదివి వినిపించారు. 

ముఖేష్- వర్షిణి, కృష్ణుడు- రోహిత్‌లు ఒక జోడీగా టాస్క్ ఆడారు. ఈ టాస్క్‌లో ముఖేష్-వర్షిణి గెలిచి మేజిక్ కీలను సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా త్రిగుణ్, సింగర్ ఝాన్సీ, ఆటో రాంప్రసాద్, శాలిని, సృష్టి, పొట్టి నరేశ్, వర్షిణి, ముఖేష్ గౌడతో కలిపి 8 మంది మేజిక్ కీలను గెలుచుకున్నారు. మరో రెండు కీలు బ్యాలెన్స్ ఉండగా వాటిని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. 


Who Is GDN: 100 ఏళ్ల కిందటే మేక్ ఇన్ ఇండియాకు పునాది... ఎవరీ జీడీఎన్?

 


విలక్షణ నటుడు మాధవన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జీడీఎన్. కొయంబత్తూరుకు చెందిన భారతీయ శాస్త్రవేత్త, ఇంజనీర్, పారిశ్రామికవేత్త గోపాలస్వామి దొరస్వామి నాయుడు జీవితం, ఆయన సాధించిన విశేషాలు ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో జీడీఎన్‌గా మాధవన్ టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమా టైటిల్ ప్రకటించిన నాటి నుంచే ప్రత్యేకత సంతరించుకుంది. మాధవన్ లుక్ బయటకు వచ్చిన తర్వాత అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఆగస్ట్ 7న జీడీఎన్ విడుదల కానుంది. అయితే ఎవరీ జీడీఎన్? ఆయన జీవితం ఏంటీ? జీడీఎన్ సాధించిన విజయాలు ఏంటీ? అనే ఆసక్తి జెన్ జీ పిల్లల్లో నెలకొంది. 

కోయంబత్తూరులో స్థిరపడిన తెలుగు రైతు కుటుంబంలో 1893 మార్చి 23న జన్మించారు జీడీ నాయుడు. ఆయన పుట్టిన కొద్దినెలలకే తల్లి చనిపోయారు. అనివార్య కారణాలతో మూడో తరగతిలోనే చదువు మానేశారు. కోయంబత్తూరులోని ఓ హోటల్‌లో సర్వర్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన రూపాయి రూపాయి కూడబెట్టి దాచిన డబ్బుతో చిన్న మోటార్ సైకిల్ కొనుగోలు చేసి ప్రయోగాలు ప్రారంభించారు. ఆ మోటార్ సైకిల్‌లోని ప్రతి భాగాన్ని విడదీసి.. మళ్లీ బిగించి మెకానిక్‌గా మారిపోయారు. 

1920లలో ఒక ఆటోమొబైల్ కోచ్‌ను కొన్న ఆయన ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌లోకి దిగారు. పొల్లాచ్చి నుంచి పళని వరకు ప్రయాణించారు. కొన్నేళ్లకే వ్యాపారంలో సత్తా చాటిన నాయుడు తన యూనివర్సల్ మోటార్ సర్వీస్ (యూఎంఎస్)తో దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ రంగంలో గుర్తింపు సంపాదించారు. కేవలం 13 సంవత్సరాలలోనే ఆయన రవాణా సామ్రాజ్యం అనూహ్యంగా విస్తరించి  280కి పైగా బస్సులను కలిగి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బస్సు కంపెనీలలో ఒకటిగా ఘనత వహించింది. 

1930లో న్యూ ఎలక్ట్రిక్ వర్క్స్ కంపెనీని ప్రారంభించి ఎలక్ట్రిక్ మోటార్లను ఉత్పత్తి చేశారు. భారతదేశంలో తొలి మోటార్‌ను జీడీ నాయుడు కంపెనీయే తయారు చేసింది. కోయంబత్తూరులో ఉన్న ఆయన ఫ్యాక్టరీ నేషనల్ ఎలక్ట్రిక్ వర్క్స్ ఈ వినూత్న ఆవిష్కరణ చేసింది. అలాగే గోపాల్ క్లాక్ ఇండస్ట్రీ కూడా వినియోగదారుల ఆదరణను పొందింది. 

నాయుడు.. పరిశోధనలు, సంచలనాలు అక్కడితో ఆగలేదు. 1937లో డీ బాలసుందరం నాయుడుతో కలిసి భారతదేశంలో తొలి ఇండిజెనస్ మోటర్‌ను తయారు చేశారు. ఈ విజయంతో బాలసుందరం టెక్ట్స్‌టూల్‌ను కనుగొని టెక్ట్స్‌టూల్ బాలసుందరంగా మారారు. ఆ తర్వాత డ్రై సెల్స్‌తో రేజర్‌ను తయారు  చేశారు జీడీఎన్. సూపర్ థిన్ షేవింగ్ బ్లేడ్స్‌, సినిమా కెమెరాలలో డిస్టెన్స్ అడ్జెస్టర్, ఫ్రూట్ జ్యూస్ ఎక్స్‌ట్రాక్టర్, టాంపర్ ప్రూఫ్ వోట్ రికార్డింగ్ మెషిన్, కిరోసిన్‌తో నడిచే ఫ్యాన్, ఫైవ్ వాల్వ్ రేడియో సెట్స్, టూ సీటర్‌ పెట్రోల్ ఇంజిన్ కార్ తదితర ఆవిష్కరణలతో సంచలనం సృష్టించారు జీడీఎన్. 

అయితే ఆయన ప్రయోగాలకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సహం లభించలేదు, లైసెన్స్ మంజూరు చేయడానికి కూడా ముందుకు వచ్చేది కాదు. దాంతో ఆయన ఆటోమోటివ్స్ ప్రయోగాలను పక్కనపెట్టి.. రైతాంగానికి కొత్తరకం పత్తి, బొప్పాయి, మొక్కజోన్న విత్తనాలను తయారు చేశారు జీడీఎన్. ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని దిగ్గజ శాస్త్రవేత్త సర్ సీవీ రామన్, ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు సందర్శించారు. ఇక కేవలం 11 గంటల రికార్డ్ సమయంలోనే ఇంటిని నిర్మించి సంచనం సృష్టించారు జడీఎన్. 

1922లో లండన్‌లో జరిగిన కింగ్ జార్జ్ V అంత్యక్రియలను వ్యక్తిగతంగా వీడియో తీశారు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను కూడా జీడీఎన్ కలిశారు. అప్పటి కాంగ్రెస్ అగ్రనేత కే కామరాజ్‌తో సన్నిహితంగా ఉండేవారు జీడీఎన్. అలాగే జాతిపతి మహాత్మాగాంధీ, తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లను తన కెమెరాలో బంధించారు. రాజకీయాలపై ఆసక్తితో 1936 ప్రావిన్సియల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలవ్వడంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. నాయుడుకు రోల్స్ రాయిస్ కారు బహుమతిగా లభించగా.. ఆ రోజుల్లో అంతటి విలాసవంతమైన కారును కలిగివున్న ఏకైక వ్యక్తి జీడీఎన్ కావడం విశేషం. 

1944లో ఆటోమొబైల్ తదితర ప్రయోగాల నుంచి పదవీ విరమణ తీసుకున్న జీడీఎన్.. సామాజిక సేవా కార్యక్రమాలతో సంచలనం సృష్టించారు. 1945లో కోయంబత్తూరులో భారతదేశంలోనే మొట్టమొదటి పాలిటెక్నిక్ కాలేజీ అయిన ఆర్ధర్ హోప్ పాలిటెక్నిక్ కాలేజీ (ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ)ని స్థాపించడానికి చొరవ తీసుకుని భారీ విరాళాలు అందజేయడంతో పాటు ఈ కాలేజీకి ప్రిన్సిపాల్‌గానూ వ్యవహరించారు. 

ఆ సమయంలో పాలిటెక్నిక్‌ కోర్సుకు 4 ఏళ్ల కాలం విద్యార్ధుల సమయాన్ని వృథా చేయడమేనని భావించిన జీవిఎన్ దానిని రెండేళ్లకు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఆయన ప్రతిపాదనను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం తిరస్కరించడంతో పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్‌ పదవికి రాజీనామా చేశారు. 1967లో జడీ నాయుడు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను స్థాపించారు. 

తన ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలలో వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించారు జీడీఎన్. ఎలక్ట్రికల్, మెకానికల్, అగ్రికల్చర్, హైబ్రీడ్ కల్టీవేషన్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో ఎన్నో పరిశోధనలు, ఎన్నో ఆవిష్కరణలు చేసి కోయంబత్తూరు నగరం దేశంలోనే ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా మార్చడంలో కీలకపాత్ర పోషించారు. సామాన్య ప్రజల జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపిన ఎన్నో వస్తువులను జీడీఎన్ ఆవిష్కరించి.. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్ట్‌లను వందేళ్ల క్రితమే ప్రారంభించి స్థానికంగా వస్తువులను ఆవిష్కరించడానికి పునాది వేసిన ఘనత జీడీ నాయుడుదే. 

1974లో 80 ఏళ్ల వయసులో జీడీ నాయుడు తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు జీడీ గోపాల్, మనవడు జీడీ రాజ్‌కుమార్, మనవరాలు శాంతిని ఉన్నారు. జీడీఎన్ గౌరవార్థం కోయంబత్తూరులోని ఒక స్కూల్‌కు జీడీ మెట్రిక్యూలేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, జీడీ పబ్లిక్ స్కూల్‌కు ఆయన పేరు పెట్టారు. అలాగే ఓ రోడ్డుకు జీడీ నాయుడు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేగా  నామకరణం చేశారు. 


నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. ఛత్రపతి విలన్ మరణానికి కారణమేంటీ?

 


ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆగస్ట్ 4వ తేదీన గుండెపోటుతో ప్రదీప్ రావత్ ముంబైలో తుదిశ్వాస విడిచారు. తెలుగుతో పాటు పలు భాషల్లో ఆయన నటించారు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలతో ప్రదీప్ తనదైన ముద్రవేశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

ప్రదీప్ రావత్ ప్రస్థానం:

1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించారు ప్రదీప్ రావత్. ఆయన అసలు పేరు ప్రదీప్ సింగ్ రావత్. తొలుత హిందీలో అతిబార్ అనే సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన చిన్నాచితకా పాత్రలు పోషిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో బుల్లితెరపై అడుగుపెట్టిన ప్రదీప్ రావత్.. బీఆర్ చోప్రా తెరకెక్కించిన ఫేమస్  సీరియల్ మహాభారత్‌లో అశ్వత్థామగా నటించారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ ధారావాహికతో ప్రదీప్ రావత్‌కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తెహల్కా, చంద్రకాంత, యుగ్, గుల్ సానోబార్, మిషన్  ఫ్రెష్ తదితర సీరియల్స్‌లో నటించారు.

2001లో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ నటించిన లగాన్‌లోనూ ప్రదీప్ రావతో కీలకపాత్ర పోషించారు. 2004లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై చిత్రంతో తెలుగువారిని పలకరించిన ఆయన భిక్షు యాదవ్‌గా ప్రేక్షకులను భయపెట్టారు. ఈ సినిమాకు గాను ఉత్తమ విలన్‌గా ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులను అందుకున్నారు. ఆ తర్వాత ఛత్రపతితో ప్రదీప్  రావత్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. పవర్‌ఫుల్ విలన్‌గా, ప్రభాస్‌కు ధీటుగా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు.

ఆ తర్వాత భద్ర, స్టాలిన్, దేశముదురు, యోగి, గజినీ, మస్కా, రెబల్, నిప్పు, నాయక్, వన్ నేనొక్కడినే, నేను శైలజ, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, జై లవకుశ, నా పేరు సూర్య, వాల్తేర్ వీరయ్య తదితర తెలుగు సినిమాలలో నటించారు. చివరిసారిగా ఈ ఏడాది విడుదలైన గాయపడ్డ సింహం సినిమాలో ప్రదీప్ రావత్ తెలుగులో నటించారు. 40 ఏళ్ల కెరీర్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, ఒడియా, బెంగాలీ, భోజ్‌పురి, నేపాలీ, మరాఠీ భాషలలో ఆయన వందలాది చిత్రాల్లో నటించారు. 

ప్రదీప్ రావత్‌కు భార్య కళ్యాణి రావత్, పిల్లలు విక్రాంత్ రావత్, సింగ్ రావత్ ఉన్నారు. ప్రదీప్ భార్య కళ్యాణి తెలుగు అమ్మాయే కావడం విశేషం. హీరోయిన్లను మించిన అందంతో మెరిసిపోయే కళ్యాణి.. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. తన నటనతో కోట్లాది మందిని అలరించిన ప్రదీప్ రావత్ మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. 




ఐడియాను దాచుకోవద్దు.. అమ్మేయండి.. పాతికేళ్ల వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ

 


ప్రస్తుతం జెన్ జీ జనరేషన్ ఆకాశామే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, సాదాసీదా కుటుంబం నుంచి వచ్చినా జీవితంలో సక్సెస్ కొడుతున్నారు. పుట్టినప్పటి నుంచే టెక్నాలజీని వాడుతున్న ఈ తరం వారు.. ఏ సెక్టార్ అయినా సరే తమదైన బెంచ్ మార్క్‌లు సెట్ చేస్తున్నారు. నిండా పాతికేళ్లు కూడా దాటకుండానే కోటీశ్వరులుగా మారిపోతున్న వారు ఉన్నారు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని సూత్రానికి తమ తెలివితేటలు జోడించి జెండా ఎగురవేస్తున్నారు. తాజాగా ఓ పాతికేళ్ల కుర్రాడు తన తెలివితేటలతో వ్యాపారవేత్తగా అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఆయన సక్సెస్ స్టోరీ మీకోసం.

అతను ఎవరో కాదు.. జెడిటల్ మీడియా వ్యవస్థాపకుడు జైద్ ఖాన్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఖాన్.. తొలుత డాక్టర్ కావాలని కలలు కన్నారు. ఒకవేళ నీట్‌లో క్వాలిఫై కాకపోతే ఇంజనీరింగ్ ‌సెకండ్ ఛాయిస్‌గా పెట్టుకున్నారు. అయితే డెస్టినీ ఆయనను  మరో మార్గం వైపు నడిపించింది. యూట్యూబ్ ఛానెల్స్‌కు పనిచేయడం ప్రారంభించి, కాలిఫోర్నియాకు చెందిన ఓ ఫేమస్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌తో పాటు కొన్ని ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌లను దక్కించుకున్నాడు. పర్సనల్ బ్రాండింగ్, మీమ్ మార్కెటింగ్, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్, లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్‌ నిర్వహణ సేవలను జెడిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌ ద్వారా అందిస్తున్నారు.

ఇటీవల ది క్రోర్ క్లబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన వ్యాపార ప్రయాణం, ఆర్ధిక విజయాలు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు జైద్ ఖాన్. మీ దగ్గర ఉన్నది నైపుణ్యం, సలహా.. ఏం ఉన్నా సరే ముందు అమ్మడం మొదలుపెట్టాలి. అది 100 డాలర్లయినా, 200 డాలర్లయినా సరే.. ఇది మీలోని ఆత్మ విశ్వాసాన్ని మరో స్థాయికి చేరుస్తుంది. ఆన్‌లైన్‌లో యాక్టీవ్‌గా ఉండటం, మీకంటూ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకోవాలని ఖాన్ తెలిపారు.

2023లో నా 22వ యేట తొలిసారిగా కోటి రూపాయల ఆదాయాన్ని ఆర్జించానని అప్పటి నుంచి తన వ్యాపారాన్ని విస్తరిస్తూనే ఉన్నానని.. విద్యాపరంగా మరింత పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఐఐఎం బెంగళూరులో చదువుకుంటున్నట్లు చెప్పాడు. నేను జీవితంలో వెనుకబడిపోయింది చదువు విషయంలోనే.. అందుకే కొత్త విషయాలు నేర్చుకుంటూ వాటిని వ్యాపారంలో అమలు చేస్తున్నా. మనం ఏం సాధించాలనుకున్నా దానికి డబ్బు ఇంధనం వంటిదని ఖాన్ చెప్పారు.

ఈ ప్రయాణంలో నా తల్లిదండ్రులు నాపై నమ్మకం ఉంచారు. నీట్‌కు 10 రోజుల ముందు నన్ను జర్నలిజంలో చేర్చించారు. కానన్ 80డీ కెమెరాతో వీడియోలు తీసి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసి ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించే స్థాయికి ఎదిగినట్లు ఖాన్ వెల్లడించారు. కంటెంట్ అనేది డిజిటల్ కరెన్సీ.. ఆన్‌లైన్‌లో యాక్టీవ్‌గా లేనప్పుడు మీరు ఎవ్వరికీ కనిపించరు, ఎవ్వరికీ తెలియదని ఖాన్ అభిప్రాయపడ్డారు. 


సాయిపల్లవి క్రేజ్.. రామాయణకు లేడీ పవర్‌స్టార్‌కు రికార్డ్ రెమ్యునరేషన్?

 


గ్లామర్ షో, ఇంటిమేట్ సీన్స్‌కు దూరంగా ఉంటూ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటవచ్చని నిరూపించారు లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవి. ఇష్టమొచ్చిన కథలను ఎంచుకోకుండా తనకు మనసుకు నచ్చిన, కథాబలమున్న పాత్రలనే చేస్తూ అరుదైన వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు సాయిపల్లవి. అందం, డ్యాన్స్, నటన ఇలా ఏ విషయంలోనైనా తనకు తిరుగులేని నిరూపించుకున్నారు ఈ ముద్దుగుమ్మ.

దక్షిణాదిలో ఎదురులేదని ప్రూవ్ చేసుకున్న సాయిపల్లవి.. ప్రస్తుతం బాలీవుడ్‌లో జెండా ఎగరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఏక్ దిన్‌తో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయిపల్లవి అనుకున్న రిజల్ట్ రాబట్టలేకపోయారు. అయితే రణబీర్ కపూర్ హీరోగా నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి పల్లవి అకాశం దక్కించుకున్నారు. ఇందులో సీతగా ఆమె నటిస్తున్నారు. 

దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి కానుకగా నవంబర్ 6న రామాయణ తొలి భాగం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ ప్రతిష్టాత్మక సినిమా కోసం సాయి పల్లవి రెండేళ్లకు పైగా సమయం వెచ్చించారు. అయితే సీతగా సాయి పల్లవిని తీసుకోవడంపై హిందీ జనాలు, సినీ ప్రముఖులు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు లేడీ పవర్‌స్టార్.

అయితే రామాయణ కోసం సాయి పల్లవి రెమ్యునరేషన్ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం రామాయణ రెండు భాగాలకు కలిపి సాయి పల్లవికి 20 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక దక్షిణాదికి చెందిన హీరోయిన్‌కు బాలీవుడ్‌లో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందించడం సాధారణ విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ దెబ్బతో భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే ప్రియాంక చోప్రా, దీపిక పదుకొణె, ఆలియా భట్, నయనతార, రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్ల సరసన సాయి పల్లవి స్థానం సంపాదించుకున్నారు.