నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. ఛత్రపతి విలన్ మరణానికి కారణమేంటీ?
ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆగస్ట్ 4వ తేదీన గుండెపోటుతో ప్రదీప్ రావత్ ముంబైలో తుదిశ్వాస విడిచారు. తెలుగుతో పాటు పలు భాషల్లో ఆయన నటించారు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలతో ప్రదీప్ తనదైన ముద్రవేశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ప్రదీప్ రావత్ ప్రస్థానం:
1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించారు ప్రదీప్ రావత్. ఆయన అసలు పేరు ప్రదీప్ సింగ్ రావత్. తొలుత హిందీలో అతిబార్ అనే సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన చిన్నాచితకా పాత్రలు పోషిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో బుల్లితెరపై అడుగుపెట్టిన ప్రదీప్ రావత్.. బీఆర్ చోప్రా తెరకెక్కించిన ఫేమస్ సీరియల్ మహాభారత్‌లో అశ్వత్థామగా నటించారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ ధారావాహికతో ప్రదీప్ రావత్‌కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తెహల్కా, చంద్రకాంత, యుగ్, గుల్ సానోబార్, మిషన్ ఫ్రెష్ తదితర సీరియల్స్‌లో నటించారు.
2001లో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ నటించిన లగాన్‌లోనూ ప్రదీప్ రావతో కీలకపాత్ర పోషించారు. 2004లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై చిత్రంతో తెలుగువారిని పలకరించిన ఆయన భిక్షు యాదవ్‌గా ప్రేక్షకులను భయపెట్టారు. ఈ సినిమాకు గాను ఉత్తమ విలన్‌గా ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులను అందుకున్నారు. ఆ తర్వాత ఛత్రపతితో ప్రదీప్ రావత్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. పవర్‌ఫుల్ విలన్‌గా, ప్రభాస్‌కు ధీటుగా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు.
ఆ తర్వాత భద్ర, స్టాలిన్, దేశముదురు, యోగి, గజినీ, మస్కా, రెబల్, నిప్పు, నాయక్, వన్ నేనొక్కడినే, నేను శైలజ, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, జై లవకుశ, నా పేరు సూర్య, వాల్తేర్ వీరయ్య తదితర తెలుగు సినిమాలలో నటించారు. చివరిసారిగా ఈ ఏడాది విడుదలైన గాయపడ్డ సింహం సినిమాలో ప్రదీప్ రావత్ తెలుగులో నటించారు. 40 ఏళ్ల కెరీర్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, ఒడియా, బెంగాలీ, భోజ్‌పురి, నేపాలీ, మరాఠీ భాషలలో ఆయన వందలాది చిత్రాల్లో నటించారు.
ప్రదీప్ రావత్‌కు భార్య కళ్యాణి రావత్, పిల్లలు విక్రాంత్ రావత్, సింగ్ రావత్ ఉన్నారు. ప్రదీప్ భార్య కళ్యాణి తెలుగు అమ్మాయే కావడం విశేషం. హీరోయిన్లను మించిన అందంతో మెరిసిపోయే కళ్యాణి.. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. తన నటనతో కోట్లాది మందిని అలరించిన ప్రదీప్ రావత్ మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
.jpg)
Comments
Post a Comment