ఆ 400 ఎకరాలను కాపాడాం.. హెచ్‌సీయూ భూముల వివాదంపై భట్టి విక్రమార్క క్లారిటీ
హెచ్‌సీయూ భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. గచ్చిబౌలీలోని 400 ఎకరాల భూములపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని.. దీనిపై ప్రజలకు వాస్తవ పరిస్ధితులు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను తెలంగాణ ప్రభుత్వం గుంజుకుని దానిని రకరకాలుగా ఫ్లాట్లుగా మార్చి అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. 13.01.2004 వరకు ఈ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోనే ఉందని యూనివర్సిటీ వాళ్లు భావించారని భట్టి చెప్పారు.
కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ 400 ఎకరాలను యూనివర్సిటీ నుంచి తీసుకుని స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిమిత్తం ఐఎంజీ భారత్ అనే సంస్థకు ఇచ్చిందని విక్రమార్క తెలిపారు. ఆ 400 ఎకరాలకు బదలాయింపుగా 397 ఎకరాలను అదే యూనివర్సిటీకి ఆనుకుని గోపన్‌పల్లిలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని భట్టి చెప్పారు. ఈ భూ బదలాయింపుకు సంబంధించిన ఉత్తర్వులను భట్టి విక్రమార్క మీడియాకు చూపించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు, యూనివర్సిటీ అధికారులు కలిసి సంతకం పెట్టారని డిప్యూటీ సీఎం వెల్లడించారు. 400 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చేశామని.. దానికి బదులుగా మరో చోట 400 ఎకరాలను తీసుకున్నట్లుగా యూనివర్సిటీ అధికారులు సంతకాలు చేశారని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రజల ఆస్తి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండాలని భావించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసిందని భట్టి విక్రమార్క చెప్పారు. అయితే అప్పటికే ప్రభుత్వం మాకు 400 ఎకరాలు అప్పగించినందున .. ఒప్పందం క్యాన్సిల్ చేయడంపై యూనివర్సిటీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారని భట్టి పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తన వాదనను హైకోర్టులో గట్టిగా వినిపించిందని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు.
తర్వాత రాష్ట్ర విభజన జరగడం 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం జరిగాయని భట్టి తెలిపారు. మన భూములు మన బిడ్డలకే చెందాలనే ఉద్దేశంతో కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ భూముల గురించి పట్టించుకోకుండా, గాలికి వదిలేసిందని విక్రమార్క దుయ్యబట్టారు. ఆ భూమి ప్రైవేట్ వ్యక్తుల్లో ఉంటే ఇంకో రకంగా ఎలా తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని డిప్యూటీ సీఎం ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చిన మరుక్షణం హైకోర్టులో కోట్లాడి కేసు గెలిచి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వేల కోట్ల విలువైన భూమి వెల్లకుండా కాపాడితే ఎవరైనా అభినందిస్తారని అన్నారు. గత ఒప్పందాల గురించి తెలియని వాళ్లే భూములపై రాజకీయం చేస్తున్నారని డిప్యూటీ సీఎం మండిపడ్డారు.
అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. యువత ఎన్నో పోరాటాలు చేసి మన రాష్ట్ర మనకి వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మిందని భట్టి తెలిపారు. యువతకి ఆస్తుల్ని సృష్టించడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తోందని భట్టి చెప్పారు. ఆ రోజుల్లో హైటెక్ సిటీకి ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి గారు, రాజీవ్ గాంధీ గారి ఆలోచన మేరకు కంప్యూటర్ విప్లవాన్ని ఈ దేశంలో తీసుకుని రావాలని అనుకున్నారని విక్రమార్క వెల్లడించారు.
హైటెక్ సిటీకి వారు ఫౌండేషన్ వేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానిని కంటిన్యూ చేయడం వల్ల లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడం వల్లే లక్షలాది మంది యువత వచ్చి ఉపాధి పొందుతున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆ 400 ఎకరాల భూమిని వెనక్కి తీసుకొచ్చి సాఫ్ట్‌వేర్ ఇతర రంగాల కంపెనీలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తాము కృషి చేస్తున్నామని భట్టి తెలిపారు.
యూనివర్సిటీకి చెందిన అంగుళం భూమిని కూడా తాము ముట్టుకోమని, హైదరాబాద్ నగరం కాలుష్యరహిత నగరంగా ఉండాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
Comments
Post a Comment