USA: వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా భారత సంతతి మహిళ... ఎవరీ గజాలా హష్మీ?
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ ఉన్నత శిఖరాలను చేరుకుంటూ వ్యవస్థలను కూడా శాసిస్తున్నారు. ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు గానే రాజకీయ నాయకులుగా రాణిస్తున్నారు. గత డెమొక్రాట్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన కమలా దేవి హారిస్ భారత మూలాలున్న మహిళ కావడం భారతీయులందరికీ గర్వకారణం. వీరే కాకుండా అమెరికాలో మేయర్లుగా, ఎంపీలు, అటార్నీలుగా, గవర్నర్‌లుగా ఇతర ఉన్నత హోదాలలో పనిచేస్తున్న భారతీయులకు లెక్కే లేదు.
కమలా హారిస్‌కు చేజారిన అదృష్టం:
అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే కమలా హారిస్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళగా.. తొలి భారత మూలాలున్న వ్యక్తిగా, తొలి నల్లజాతి మహిళగా, తొలి ఆసియా మూలాలున్న వ్యక్తిగా నిలిచేవారు. అయితే ఈ అవకాశం ఆమెకు తృటిలో చేజారి ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే 2028 ఎన్నికల్లో ఖచ్చితంగా కమలా హారిస్ పోటీ చేసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడతారని అమెరికాలో స్థిరపడిన భారతీయులు బలంగా విశ్వసిస్తున్నారు.
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజలా హష్మీ:
అమెరికాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా భారతీయులు పోటీ చేస్తారు. తాజాగా భారత మూలాలున్న మహిళ ఒకరు ఎన్నికల్లో సత్తాచాటారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా డెమొక్రాటిక్ పార్టీకి చెందిన గజాలా హష్మీ సంచలన విజయం సాధించారు. అంతేకాదు.. అమెరికాలో ఈ అత్యున్నత పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా గజాలా చరిత్ర సృష్టించారు.
ఎవరీ గజాలా హష్మీ:
గజాలా హష్మీ అచ్చ తెలుగు మహిళ.. ఆమె స్వస్థలం హైదరాబాద్ కావడం విశేషం. 1964లో హైదరాబాద్‌లో జన్మించిన గజాలా... మలక్‌పేటలో బాల్యాన్ని ఆస్వాదించారు. ఈమె తాతగారు.. అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఈ దశలో నాలుగేళ్ల వయసులోనే తన కుటుంబంతో కలిసి గజాలా అమెరికాలోని జార్జియాకు వలస వెళ్లారు. ఉన్నత విద్యావంతుల కుటుంబం కావడంతో గజాలా కూడా చదువులో టాపర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. జార్జియా యూనివర్సిటీలో బీఏ హానర్స్ చదువుకున్నారు. అలాగే ఎమరి వర్సిటీ నుంచి లిటరేచర్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
అజహర్ అనే వ్యక్తిని గజాలా వివాహం చేసుకోగా.. వారి మకాం జార్జియా నుంచి వర్జీనియాకు మారింది. ఇక్కడి రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్‌గా దాదాపు 30ఏళ్ల పాటు సేవలు అందించారు గజాలా. రాజకీయాలపై ఆసక్తితో డెమొక్రాటిక్ పార్టీలో చేరిన గజాలా.. 2019లో తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2024లో సెనేట్ ఎడ్యుకేషన్, హెల్త్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా డెమొక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు.

Comments
Post a Comment