సామాన్లు చూపించొద్దు.. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై హీరో శివాజీ కామెంట్స్
హీరోగా ఒకప్పుడు వరుస సినిమాలు చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు నటుడు శివాజీ. పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన ఆయన తర్వాత అనూహ్యంగా రాజకీయాలు, అమరావతి ఉద్యమం వైపు వెళ్లారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ఉన్న సమయంలో అమరావతిని నిర్లక్ష్యం చేయడం, మూడు రాజధానుల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు నిర్వహించిన నిరసనల్లో శివాజీ పాల్గొన్నారు. రైతుల పోరాటానికి మద్ధతుగా టీవీలలో జరిగే చర్చా కార్యక్రమాల్లోనూ, బహిరంగ వేదికలపైనా మాట్లాడి రైతుల పక్షాన తన గొంతును వినిపించారు.
సినిమాలకు దూరంగా ఉన్న దశలో అనూహ్యంగా బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి షాకిచ్చాడు శివాజీ. బిగ్‌బాస్ ఆటతీరును మొత్తం చదివేసి తనదైన గేమ్‌తో షోను నడిపించాడు. సామాన్యులుగా వచ్చిన ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్‌లతో కలిసి గేమ్ ఆడాడు. దాంతో అభిమానులు ఈ ముగ్గురిని స్పై బ్యాచ్ అంటూ ముద్దుగా పిలుచుకునేవారు. ప్రిన్స్, పల్లవి ప్రశాంత్‌లకు మద్ధతు ఇస్తూ వారిని ఫైనల్ వరకు తీసుకెళ్లి చాణక్యుడిగా ముద్ర వేయించుకున్నాడు శివాజీ. పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ కావడం వెనుక కీలకపాత్ర పోషించాడు.
ఇక దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత కోర్ట్: స్టేట్ వర్సెస్ నో బడి సినిమాలో మంగపతి క్యారెక్టర్ ద్వారా శివాజీ తనలోని మరో కోణాన్ని చూపించాడు. మంగపతి పాత్రకు మంచి గుర్తింపు, ప్రశంసలు రాగా.. తనకు ఈ తరహా క్యారెక్టర్లు బాగా వస్తున్నాయని చెప్పాడు. ఇప్పటి తరం తనను కొత్తగా చూస్తోందని శివాజీ తెలిపాడు. ఇక 90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్‌లో తండ్రిగానూ శివాజీ అద్భుతంగా నటించి జెన్ జెడ్‌కు బాగా కనెక్ట్ అయ్యారు.
ప్రస్తుతం శివాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దండోరా. మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీమతి ముప్పనేని శ్రీలక్ష్మీ సమర్పిస్తున్నారు. నవీదప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మానిక, మౌనిక రెడ్డి, రాధ్యా, మురళీధర్ గౌడ్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మార్క్ కే రాబిన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రాఫర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా సేవలందించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న దండోరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడటంతో డిసెంబర్ 22న హైదరాబాద్‌లో దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో శివాజీ మాట్లాడుతూ.. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లు తాము ధరించే డ్రెస్స్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిల అందం నిండుగా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది కానీ సామాన్లు చూపించడంలో కాదు. ఇలాంటి బట్టలు వేసుకుంటే బయటికి అందరూ బాగుందనే అంటారు. కానీ లోలోపల తిట్టుకుంటారు అని శివాజీ వ్యాఖ్యానించారు.
స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అమ్మాయిలపై అంత గౌరవం పెరుగుతుంది. మా అమ్మ.. మహానటి సావిత్రి ఇప్పటికీ నిండైన రూపంతో మన గుండెల్లో నిలిచిపోవడానికి కారణం వారి నటన, వస్త్రధారణే. గ్లామర్ ఉండాలి.. కానీ అది హద్దులు దాటకూడదు. గౌరవం మన వేష భాషల నుంచే వస్తుంది.. విశ్వవేదికలపై చీర కట్టుకున్న వారికే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయని శివాజీ అన్నారు. ప్రస్తుతం శివాజీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ, సినీరంగంలోనూ చర్చనీయాంశం అయ్యాయి.
.jpg)
Comments
Post a Comment