బాలయ్య సింహగర్జన.. అఖండ 2కు ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?

 


బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం ఎన్నో అడ్డంకులను దాటుకుని ప్రేక్షకుల ముందుకొచ్చింది. వాస్తవానికి డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అఖండ 2 చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్‌కు ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు గతంలో ఉన్న అర్ధిక వివాదం నేపథ్యంలో సదరు సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించే వరకు అఖండ 2 నిలుపుదల చేయాల్సిందిగా ఎరోస్ ఇంటర్నేషనల్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకున్న న్యాయస్థానం అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసింది.

అఖండ 2 విడుదలపై వివాదం

దాంతో డిసెంబర్ 4వ తేదీన కొద్దిగంటల్లో ప్రీమియర్స్ కోసం సిద్ధమవుతున్న అభిమానులకు షాక్ తగిలినట్లయ్యింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాలు సహా నేషనల్ వైడ్ అఖండ 2 ప్రీమియర్స్ రద్దయ్యాయి. ఓవర్సీస్‌లో బొమ్మ పడుతుందని అనుకున్నప్పటికీ అక్కడా షోలు క్యాన్సిల్ చేస్తున్నట్లు 14 రీల్స్ ప్రకటించింది. అయితే తెల్లారితే రిలీజ్ ఉండటంతో అప్పటికీ సమస్య పరిష్కారం అవుతుందని భావించిన్పటికీ అఖండ 2 రిలీజ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించడంతో వరల్డ్ వైడ్‌గా నందమూరి అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

డిసెంబర్ 12న అఖండ 2 రిలీజ్

అఖండ 2 రిలీజ్‌ విషయంలో ఎదురైన ఇబ్బందులను తొలగించడానికి టాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగి చర్చలు జరిపారు. అన్ని అడ్డంకులు తొలగిపోయి అఖండ 2 రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే అప్పటికే సోమవారం వచ్చేయడంతో పాటు డిసెంబర్ 12వ తేదీ పలు చిన్నాచితకా సినిమాలు రిలీజ్‌ పెట్టుకున్నాయి. దాంతో ఈ వారంలో సినిమా విడుదల ఉంటుందా? ఉండదా? లేక మరో కొత్త తేదీని ప్రకటిస్తారా? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే తమకు డిసెంబర్ 12నే సినిమా కావాలంటూ నందమూరి అభిమానులు డిమాండ్ చేయడంతో శుక్రవారమే అఖండ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అఖండ 2 కాస్ట్ అండ్ క్రూ

గతంలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కిన అఖండ 2లో బాలకృష్ణ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. బజరంగీ భాయీజన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలకపాత్ర పోషించగా.. ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు. కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ స్వరాలు అందిస్తున్నారు.. తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు.

అఖండ 2 బడ్జెట్

అఖండకు సీక్వెల్ కావడంతో పాటు బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తోన్న నాలుగో సినిమా కావడంతో అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించడంతో అఖండ 2కు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారాన్ని బట్టి బాలకృష్ణ సినిమాకు 200 కోట్ల భారీ బడ్జెట్ అయ్యింది. బాలయ్య కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం కావడం విశేషం. బాలకృష్ణ, బోయపాటి శ్రీను, ఇతర నటీనటుల పారితోషికాలు, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి ఈ స్థాయిలో వ్యయమైందని ఫిలింనగర్ టాక్.

అఖండ 2 ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్

అఖండ 2 సినిమాకు బాలయ్య కెరీర్‌లోనే తొలిసారిగా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాంలో 23.50 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 22 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 11.50 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 7.50 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 5.50 కోట్ల రూపాయలు, గుంటూరులో 8.50 కోట్ల రూపాయలు, కృష్ణాలో 5.75 కోట్ల రూపాయలు, నెల్లూరులో 4 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లోనే 88.25 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో 11 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 116 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది అఖండ 2. దాంతో బాలయ్య - బోయపాటి సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 120 కోట్ల రూపాయల షేర్.. 240 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. అఖండ 2 చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 1000 స్క్రీన్స్‌లో, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో 1100 స్క్రీన్స్‌లో విడుదల చేశారు.

అఖండ 2 ఫస్ట్ డే కలెక్షన్స్

అఖండ 2 చిత్రానికి డిసెంబర్ 11న రాత్రి తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్స్ పడ్డాయి. బాలయ్య మూవీకి పెయిడ్ ప్రీమియర్స్‌తో ఈ సినిమాకు 7.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజున అఖండ 2 మూవీకి 21 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ప్రీమియర్స్‌తో కలిపి బాలయ్య - బోయపాటి శ్రీను మూవీకి వరల్డ్ వైడ్‌గా తొలిరోజున 34.35 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌‌‌కు 7.8 కోట్ల రూపాయలు, తొలి రోజున 20.5 కోట్ల రూపాయలు వచ్చింది. హిందీలో 10 లక్షల రూపాయలు, కన్నడలో 30 లక్షల రూపాయలు, తమిళంలో 35 లక్షల రూపాయలు, మలయాళంలో 10 లక్షల రూపాయలు వచ్చాయి. ఓవర్సీస్‌‌లో శుక్రవారం ఉదయం నాటికి అఖండ 2 చిత్రానికి 42K డాలర్లు (38 లక్షల రూపాయలు) రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ట్రేడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం బాలయ్య - బోయపాటి శ్రీనుల హై ఓల్టేజ్ యాక్షన్ మూవీకి 50 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే శనివారం ఉదయం నాటికి అఖండ 2 ఓపెనింగ్స్‌పై స్పష్టత రానుంది. 

Comments