భారత్- పాకిస్తాన్ మ్యాచ్ విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా? మ్యాచ్ రద్దయితే నష్టం ఎంతంటే?

 


త్వరలో జరగనున్న టీ 20 ప్రపంచకప్ వివాదాస్పదం అవుతోంది. భారత్‌లో భద్రతా కారణాలను సాకుగా చూపి బంగ్లాదేశ్ ఈ టోర్నీలో తప్పుకోవడంతో కలకలం రేపింది. ఐసీసీ పలుమార్లు నచ్చజెప్పాలని చూసినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) మాత్రం ససేమిరా అనడంతో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌ను ఈ టోర్నీ నుంచి తప్పించి దాని స్థానంలో స్కాట్లాండ్‌ను టీ 20 ప్రపంచకప్‌లో ఆడేందుకు అనుమతించింది. ఈ వ్యవహారం సద్దుమణిగిందో లేదో ఈ టోర్నీలో మరో వివాదం చోటు చేసుకుంది. 

బంగ్లాదేశ్‌కు మద్ధతుగా నిలబడుతూ వచ్చిన పాకిస్తాన్ ఈ టోర్నీలో భారత్‌లో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు పాక్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. 

అసలు ఏ ఐసీసీ టోర్నమెంట్ అయినా అసలు సిసలు మజా అందించేది భారత్ - పాకిస్తాన్ మ్యాచే. దాయాదుల మ్యాచ్‌ను ఇరుదేశాల ప్రజలతో పాటు క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తుంటారు. మైదానంలో సింహాల్లా పోరాడటంతో పాటు భావోద్వేగాలు ముడిపడిన అంశం కావడంతో ఏ మ్యాచ్‌కు రానంత రికార్డ్ స్థాయిలో వ్యూస్‌తో పాటు ఆదాయం కూడా భారత్ - పాక్ మ్యాచ్‌కు వస్తుండటంతో ఐసీసీ తన టోర్నమెంట్‌లలో ఖచ్చితంగా రెండు జట్లను ఒకే గ్రూప్‌లో ఆడేలా ప్లాన్ చేస్తుంది.

భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌తో ఐసీసీకి, ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు కూడా భారీ ఆదాయం వస్తోంది. ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ విక్రయాలు, ఇతర వాణిజ్య కార్యక్రమాలతో భారీ లాభాలను కళ్లజూస్తున్నారు. ఈసారి టీ 20 ప్రపంచకప్ - 2006లోనూ భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ విలువ దాదాపు 4500 కోట్ల రూపాయలని అంచనా.  ఇందులో సింహా భాగం డిజిటల్, లైవ్ టెలివిజన్ ప్రసార హక్కుల ద్వారా వచ్చేదే. 

భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ జరుగుతుండగా ప్రకటనలు ప్రసారం చేయాలంటే 10 సెకన్ల స్లాట్‌కు 25 నుంచి 40 లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అలా ఒక్క మ్యాచ్ ద్వారా ప్రకటనల కింద దాదాపు 300 కోట్ల ఆదాయం రానుంది. టీ 20 ప్రపంచకప్‌లో ఏ ఇతర జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా ఈ స్థాయిలో ఆదాయాన్ని అందించలేదు. ఒక్కో మ్యాచ్ విలువ సరాసరిగా 138 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లో ప్రకటన ద్వారా వచ్చే ఆదాయంలో సగం కూడా దాటదంటే దాయాదుల పోరుకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

ఇప్పుడు ఇండియాతో జరిగే మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కకరించడం వల్ల ఈ ప్రకటనల కింద వచ్చే ఆదాయాన్ని బ్రాడ్‌కాస్టర్స్ కోల్పోనున్నారు. ఈ మ్యాచ్ ప్రభావం.. టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌లపైనా బలంగా పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. తద్వారా బ్రాడ్‌కాస్టర్స్ దాదాపు 400 కోట్ల రూపాయలు కోల్పోతారని భావిస్తున్నారు. దీనిని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భరిస్తుంది. అయితే సభ్యదేశాలకు పంచే ఆదాయంలో కోత విధిస్తుంది. ఈ ప్రభావం క్రికెట్‌ను శాసించే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాలపై పడదు. కానీ చిన్నా చితకా జట్లకు ఐసీసీ ఆదాయమే జీవనాధారం అలాంటి దేశాలు పాకిస్తాన్ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోనున్నాయి.

అటు భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కరించడం వల్ల పాక్ క్రికెట్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారనుంది. ఐసీసీ నుంచి ఏడాదికి పాక్ క్రికెట్ బోర్డ్ 34.51 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకుంటుంది. ఇప్పుడు భారత్‌తో మ్యాచ్ రద్దయితే ఆదాయంలో కోతతో పాటు ఐసీసీ నుంచి భారీ జరిమానాలు, ప్రసారకర్తల నుంచి లీగల్ సమస్యలు, అంతర్జాతీయ క్రీడాకారులు పాకిస్తాన్‌లో పాల్గొనే మ్యాచ్‌లకు ఎన్ఓసీ అందుకునే విషయంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు. 

ఇక్కడితో ఇది ఆగదు.. క్రమశిక్షణ చర్యల కింద పాకిస్తాన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐసీసీ సస్పెండ్ చేసే అవకాశం కూడా లేకపోలేదనే వార్తలు వస్తున్నాయి. త్వరలో ఐసీసీ సమావేశం జరగనుండగా.. ఈ భేటీలో పాకిస్తాన్‌పై చర్యలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ తన నిర్ణయం పట్ల వెనక్కి తగ్గుతుందా? లేక కట్టుబడి ఉంటుందా? అన్నది చూడాలి. పీసీబీ నిర్ణయంపై క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 


Comments