నిర్మాతగా కమల్ హాసన్.. టాలీవుడ్ టాప్ హీరోతో సినిమా, దిగ్గజ నటుడి బిగ్ స్కెచ్?
నటనకే కొత్త భాష్యం చెప్పి భారతదేశం గర్వించదగ్గ మహానటుల్లో ఒకరిగా చోటు దక్కించుకున్నారు కమల్ హాసన్. చాలా ఏళ్ల క్రితమే ఆయన సినీ నిర్మాణంలో అడుగుపెట్టి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు. ప్రయోగాలకు, వినూత్నమైన కథలకు పెద్దపీట వేసే కమల్.. తన అభిరుచి వల్ల నిర్మాతలకు ఎలాంటి నష్టం కలగకుండా, నతకు నచ్చిన స్క్రిప్ట్‌లను వెండితెరపై ఆవిష్కరించేందుకు వీలుగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌ను స్థాపించారు.
1981లో అమావాస్య చంద్రుడితో మొదలుపెట్టి.. నిన్న మొన్నటి థగ్‌లైఫ్ వరకు ఎన్నో చిత్రాలను తీశారు కమల్ హాసన్. ప్రస్తుతం తన సహచరుడు, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దాదాపు 45 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నాడు కమల్. ఈ చిత్రానికి స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం రజనీకి ఏకంగా 225 కోట్ల రూపాయల పారితోషికం సైతం అందజేయబోతున్నట్లుగా కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.
దీనితో పాటు తన 237వ చిత్రాన్ని సొంతంగా నిర్మిస్తున్నారు కమల్ హాసన్. ఇది కాకుండా కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తీకేయన్‌తో సెయాన్ నిర్మిస్తున్నారు. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శివకార్తీకేయన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఇదిలాఉండగా తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థను విస్తరించాలని కమల్ భావిస్తున్నారట.
తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు నిర్మించాలని లోక నాయకుడు యోచిస్తున్నారట. టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులతో సినిమాలు తీసి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని కమల్ ప్రణాళికలు రచిస్తున్నట్లుగా చిత్ర పరిశ్రమలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ హీరోల ఇమేజ్‌కు తగిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఆయన ఉన్నారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగు స్టార్స్‌తో కమల్ సినిమా పట్టాలెక్కడం పెద్ద విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Comments
Post a Comment