అతడు మూవీలో ఆ రోల్ నాదే... 6 నెలలు తిప్పించి.. చక్రవాకం ఇంద్రనీల్ షాకింగ్ కామెంట్స్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన క్లాసికల్ మూవీస్‌లో అతడు కూడా ఒకటి. ఒక సినిమా థియేటర్‌లలో హిట్ అయితే టీవీలో ఫట్ అవుతుంది. మరికొన్ని సినిమాలు థియేటర్‌లో ఫ్లాప్ అయ్యి, టీవీలో సూపర్ హిట్‌గా నిలుస్తుంది. అయితే అతడు సినిమా రెండు చోట్లా ఘన విజయం సాధించింది. బుల్లితెరపై అయితే ఎప్పుడు ప్రసారమైనా ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోతారు. విడుదలై దాదాపు 20 ఏళ్లు కావొస్తున్నా... రీ రిలీజ్‌లలోనూ సంచలన వసూళ్లు సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై కిశోర్ దుగ్గిరాల, ఎం రామ్మోహన్‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మహేశ్ బాబు, త్రిష హీరో హీరోయిన్లు నటించగా.. ప్రకాశ్‌రాజ్, సోనూసూద్, షయాజీ షిండే, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, నాజర్, సునీల్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. 2005 ఆగస్ట్ 10న విడుదలైన అతడు చిత్రం భారీ వసూళ్లను సాధించింది.
వరల్డ్ వైడ్‌గా రూ.22 కోట్ల కలెక్షన్స్‌తో పాటు 205 కేంద్రాలలో 50 రోజులు, 38 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎంలో 175 రోజులు ప్రదర్శించబడటంతో పాటు ఆ ఒక్క థియేటర్‌లోనే ఏకంగా రూ.1.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. థియేటర్ రిలీజ్ తర్వాత దాదాపు 7 ఏళ్ల తర్వాత స్టార్ మా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కాంట్రాక్ట్‌ను దాదాపు రూ.3.5 కోట్లు వెచ్చించి రెన్యువల్ చేయించుకోవడం విశేషం. టీవీలలో దాదాపు 1000 సార్లకు పైగా టెలికాస్ట్ అయిన సినిమాగా అతడు చరిత్ర సృష్టించింది.
ఇక ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తొలుత ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్‌ల దగ్గరకి వెళ్లగా.. అనివార్య కారణాలతో చివరికి మహేశ్ బాబు ఈ సినిమాను చేయడం.. అతడు బ్లాక్‌బస్టర్ కావడం జరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో తనకు కూడా ఓ పవర్‌ఫుల్ రోల్ దక్కిందని, చివరి నిమిషంలో చేజారిపోయిందని బుల్లితెర నటుడు ఇంద్రనీల్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడకు చెందిన ఇంద్రనీల్.. ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. అతని పేరు తొలుత రాజేష్ బాబు.. అయితే న్యూమరాలజీ ప్రకారం ఇంద్రనీల్‌గా మార్చుకున్నారు. జెమినీ టీవీలో ప్రసారమైన చక్రవారం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు ఇంద్రనీల్. ఆ తర్వాత మొగలిరేకులు, కాలచక్ర, అపరంజి, సూర్యపుత్రుడు సీరియల్స్‌లో నటించాడు. ఇదే సమయంలో కాలేజ్, ఇష్టపడి, ఆరెంజ్ సినిమాలలో ఇంద్రనీల్ కీలకపాత్రలు పోసించారు. ఇటీవల విడుదలైన శంబాల మూవీతో మరోసారి తనలోని విలక్షణ నటుడిని పరిచయం చేశారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అతడు సినిమాలో ఛాన్స్ ఎలా మిస్ అయ్యిందో వెల్లడించాడు.
అతను సినిమాకు ఎంపికై 25 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నా. అప్పటికీ చక్రవాకం సీరియల్ చేస్తూ పీక్స్‌లో ఉన్నాను. త్రివిక్రమ్ గారు ఏమన్నారంటే.. నావి 40 రోజుల కాల్షీట్స్ కావాలని అడిగారు. అందులో షయాజీ షిండే కొడుకు పాత్ర నాదే. దానిని తర్వాత అజయ్ గారు చేశారు. నేను కూడా అందులో పొలిటికల్ లీడర్‌నే. కాకపోతే నాకు డిజైన్ చేసిన క్యారెక్టర్ వేరు. చాలా క్లాస్ విలన్ అన్నమాట అని ఇంద్రనీల్ చెప్పారు.
వైట్ అండ్ వైట్ ధరించి క్లాస్‌గా కనిపిస్తా. అప్పుడు నాకు 23 ఏళ్ల వయసు. నాకొక కీప్ ఉంటుంది పక్కన సరసాలు ఆడుకుంటూ, ఓ పెగ్గేస్తూ ఉంటా. కోటా శ్రీనివాసరావు గారు ఉంటారు. నా ఇంట్రడక్షన్ కోసం జయభేరీ లోకేషన్స్‌లో ఒక పెద్ద సెట్ వేశారు... చాలా బాగా చేశారు. 20 రోజులు వర్క్ చేసిన తర్వాత 40 రోజులు కాల్షీట్స్ అడ్జెస్ట్‌మెంట్స్ కావాలని అడిగారు. అప్పట్లో సీరియల్ షూటింగ్ ప్రతిరోజూ ఉండేది. చక్రవాకంలో నేనే హీరో. మేడం మంజుల నాయుడు గారు అన్నిరోజులు అడ్జెస్ట్ చేయలేను.. మ్యాగ్జిమమ్ 15 రోజులు చూసుకోగలను అని చెప్పారు అని ఇంద్రనీల్ గుర్తుచేసుకున్నారు.
ఇదే మాట నేను ప్రొడక్షన్‌లో త్రివిక్రమ్ గారి మేనేజర్‌కి చెప్పా. అప్పుడు ఆయన కనుక్కుని చెబుతాను అన్నారు. ఏదో ఒకటి చెబుతారని నేను వెయిట్ చేస్తున్నా, కాల్ రావడం లేదు. 6 నెలలు అయిపోతున్నా ఇంకా చెప్పడం లేదని నేనే మళ్లీ ట్రై చేస్తుంటే ఆ రోల్‌ని అజయ్ గారు చేస్తున్నారని తెలిసింది. అప్పుడు చాలా బాధపడ్డాను.. మిస్ అయ్యాందని ఫీల్ అయ్యా. ఆ తర్వాత ఇక సినిమాలు మనకి వద్దులే అనుకున్నా. పరిస్థితులు ఇలాగే ఉంటాయేమో.. వెళ్లినా అక్కడ ఛాన్స్ ఉంటుందో, లేదో అనిపించింది? ఇక సినిమాల మీద కాన్సన్‌ట్రేషన్ కూడా చేయలేదు అని ఇంద్రనీల్ క్లారిటీ ఇచ్చారు.

Comments
Post a Comment