అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్ట్

 


Photo Credit: X.Com/CBP

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసలు, వలస విధానంపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి నుంచి అమెరికా ఫస్ట్ విధానానికే తన ఓటు అని తన తొలి విడత పాలనా కాలంలోనే ట్రంప్ ప్రపంచానికి చూపించారు. ఆ సమయంలో ట్రంప్ దెబ్బకు వలసవాదులు వణికిపోయారు. ఇప్పుడు ట్రంప్ 2.0లో అమెరికాలో వలసదారులకు పరిస్ధితులు మరింత కఠినంగా మారాయి. 

ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే అక్రమ వలసదారులను పట్టుకుని ప్రత్యేక విమానాలలో వారి స్వదేశాలకు తరలించారు. అలాగే రోజుకొక కొత్త నిబంధనతో విదేశీయులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు ట్రంప్. హెచ్ 1తో సహా పలు రకాల ఇమ్మిగ్రేషన్, నాన్ ఇమ్మిగ్రేషన్ పాలసీలలో రకరకాల మార్పులు తీసుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా తనిఖీల పేరుతో ముచ్చెమటలు పట్టిస్తున్నారు ట్రంప్. సోషల్ మీడియాలో అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులు ఉంటే చాలు.. అరెస్ట్‌లు, వీసా తిరస్కరణ వంటి చర్యలు చేపడుతున్నారు అగ్ర రాజ్యాధినేత.

రెండ్రోజుల క్రితం కూడా హెచ్ 1 వీసాల జారీ ప్రక్రియలో కొత్త మార్పులకు అమెరికా శ్రీకారం చుట్టింది. ఎప్పటి నుంచో అమలు చేస్తోన్న లాటరీ విధానం స్థానంలో.. నైపుణ్యాలు, అధిక వేతనాలకు పెద్దపీట వేసే వ్యవస్థను తీసుకురావాలని ఫెడరల్ ప్రభుత్వం నిర్ణయించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఓ ప్రకటనలో తెలిపింది. లాటరీ విధానాన్ని ఎన్నో కంపెనీలు దుర్వినియోగం చేస్తూ తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు కొన్నేళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఫెడరల్ ప్రభుత్వం కొత్త హెచ్ 1 బీ వీసా విధానంపై కసరత్తు చేసి ఓ రూపు తీసుకొచ్చింది. హెచ్‌ 1 బీ వీసా జారీ వ్యవస్థలో కొత్త విధానం 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వస్తుందని డీహెచ్ఎస్ పేర్కొంది. అలాగే 2027 ఆర్ధిక సంవత్సరంలో హెచ్ 1 బీ క్యాప్ రిజిస్ట్రేషన్‌ సీజన్‌కు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో కంపెనీలు, విదేశీ  ఉద్యోగులు, హెచ్ 1 బీ వీసా దరఖాస్తుదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 

మరోవైపు.. కాలిఫోర్నియాలో రాష్ట్రంలోని ఇమ్మిగ్రేషన్ చెక్‌ పోస్టుల వద్ద 49 మంది అక్రమ వలసదారులను బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దాదాపు 30 మంది భారతీయులు ఉన్నట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం  తెలిపింది. మిగిలిన వారు చైనా, మెక్సికో, రష్యా, టర్కీ దేశాలకు చెందినవారిగా తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది ట్రక్ డ్రైవర్లు కావడం గమనార్హం. వీరిలో చాలామంది ట్రక్ డ్రైవర్ లైసెన్స్‌తో సెమీ ట్రక్కులు నడపటంతో పాటు అక్రమంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నట్లు గుర్తించారు.

అయితే అమెరికా ప్రభుత్వం హైవేలు, ట్రక్కు డ్రైవర్లపై విరుచుకుపడటానికి కారణం ఉంది. ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ట్రక్కుల కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. విదేశీ ట్రక్కు డ్రైవర్లకు వర్క్ వీసా, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసింది. అలాగే కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులను నడుపుతున్న వారిపై ఫోకస్ పెట్టి పెద్ద ఎత్తున అరెస్ట్‌లకు దిగుతోంది. 



Comments