NBK 111: గోపీచంద్ మలినేని మూవీ షూటింగ్‌.. బాలయ్యకు గాయం

 


గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 66 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది చివరిలో అఖండ 2తో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య ప్రస్తుతం భారీ లైనప్‌ని సెట్ చేశారు. తనతో వీరసింహారెడ్డి మూవీని తెరకెక్కించిన గోపీచంద్ మలినేనితో ఎన్‌బీకే 111 అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను  నిర్మిస్తున్నారు. ఇది కాకుండా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవలే అమరావతిలో బాలకృష్ణ - కొరటాల శివ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 

ఎన్‌బీకే 111 షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్‌కు సిద్ధం చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు. యాక్షన్, మాస్ మసాలా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య గ్యాంగ్‌స్టర్‌గా  నటిస్తున్నారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ పరిసరాల్లో జరుగుతోందట. ఇక్కడ బాలయ్య - మంచు విష్ణుల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట గోపీచంద్. 

అయితే జూలై 21న షూటింగ్‌లో బాలయ్య ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడిపోవడంతో ఆయన మోకాలికి స్వల్ప గాయమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్.. షూటింగ్‌ను నిలిపివేసి బాలయ్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారట. ప్రాథమిక చికిత్సతో పాటు ఇతర టెస్టులు కూడా నిర్వాహించారని, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు బాలయ్యకు సూచించారట. దాంతో బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. 


Comments