మూడు పార్టీలు పనిచేస్తే మరో పార్టీకి నో ఛాన్స్ : సీఎం చంద్రబాబు నాయుడు

 


ఎక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందని అన్నారు టీడీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన విజయోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. 

కూటమిపై టీచర్, గ్రాడ్యుయేట్స్ నమ్మకం పెరిగిందని.. కేంద్రం, రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తామని చంద్రబాబు తెలిపారు. కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించుకుంటామని సీఎం అన్నారు. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ ప్రగాఢమైన పాత్రను పోషించనుందని ముఖ్యమంత్రి జోస్యం చెప్పారు. నాలెడ్జ్ ఎకానమీలో కీలకమైన పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత పట్టభద్రులకు ఉందని.. స్వర్ణాంధ్ర - విజన్ 2047 నినాదం ఇచ్చామన్నారు. 

హైదరాబాద్‌ను 1995 నుంచి డెవలప్‌ చేస్తే 30 ఏళ్లలో అభివృద్ధి ఫలాలు చూస్తున్నామని ఆయన తెలిపారు.  విద్యార్ధులు, విద్యావంతులు ముందుండాలని.. 2047 నాటికి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఐటీకి ఆ రోజున ప్రాధాన్యత ఇవ్వబట్టే ప్రపంచంలోనే హయ్యెస్ట్ పర్ క్యాపిటాను తెలుగు వారు సాధించే రోజుకు వచ్చారని ఆయన గుర్తుచేశారు. 

అలాంటి విజయాలు తెలుగువారికి సాధ్యమని , కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేటి 12.4 శాతం అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. అభివృద్ధి కారణంగా తలసరి ఆదాయం పెరిగిందని.. ప్రతి నెలా, ప్రతి ఏడాది ఏ విధంగా ఆదాయం పెరుగుతోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. తలసరి ఆదాయం పెరిగితే వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయని, ఒక కొలమానంగా దానిని పెంచుకుంటూ వెళ్తామని సీఎం హామీ ఇచ్చారు. 

వేరే పార్టీలను విమర్శించి సమయం వేస్ట్ చేసుకోనని.. ప్రజలకు  కావాల్సింది పరిపాలన, అభివృద్ధి మాత్రమేనని చంద్రబాబు పరోక్షంగా వైసీపీపై సెటైర్లు వేశారు.  ఒక స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామని , ఆదాయం ఉంటే చాలదని ఆరోగ్యం, ఆనందం ఉండాలని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి సరైన ఎకో సిస్టమ్ ఉండాలన్నారు. పీపీపీ పాలసీ కింద ఆనాడే మనం చొరవ తీసుకున్నామని.. దీని వల్ల జాతీయ రహదారులు పెరిగాయని, టెలి కమ్యూనికేషన్ వ్యవస్ధ బాగుపడిందని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. 

సమాజంలో పేదరికం లేకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. అన్ని పనులు ప్రభుత్వమే చేయాలంటే కుదరదని.. అందరూ బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.  మూడు పార్టీలు  ఐకమత్యంగా పనిచేయాలని.. అప్పుడు మరో పార్టీకి అవకాశం ఉండదని చంద్రబాబు అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని, రైల్వే జోన్ పూర్తి చేసుకున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ సాధ్యమైందని ఎన్టీపీసీ, జెన్ కో ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదీ జలాల విషయంలో లేవనెత్తిన అంశాలపైనా చంద్రబాబు స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు తాము ఏనాడు అడ్డు చెప్పలేదని.. ఇంకా గోదావరి నుంచి ఎంత నీటిని తీసుకున్నా తనకు అభ్యంతరం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. గోదావరి నది తెలుగు ప్రజలకు శ్రీరామరక్ష అని.. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని కరువు ప్రాంతాలకు తరలించుకోవాలని , కానీ ఏపీ నీటి విషయంలో మాత్రం బాధపడొద్దని తెలంగాణ ప్రభుత్వానికి ఆయన సూచించారు. 

రాజమండ్రిని దాటితే గోదావరి నీరు సముద్రంలోకి పోతుందని.. చివరి ప్రాంతాలకు మిగులు జలాలను పొందే హక్కు ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు జాతి కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. 

Comments