కరెక్ట్ టైమ్‌కి దిగుతోందిగా .. వకీల్ సాబ్ రీ రిలీజ్ , పవన్‌కు కలిసొస్తుందా ..?

 


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో తగ్గేదే లేదన్నట్లుగా పోరాటం చేస్తున్నారు. పార్టీ స్థాపించి పదేళ్లు కావొస్తున్నా నేటికీ ఎలాంటి పదవులు అందుకోకపోవడంతో కేడర్ సైతం నైరాశ్యంలో వున్నారు. దీంతో తనను తాను నిరూపించుకోవడంతో పాటు విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. వైఎస్ జగన్‌ను ఈసారి గెలవనివ్వకూడదని తొలి నుంచి చెబుతూ వస్తున్న జనసేనాని.. ఈసారి పొత్తుతోనే బరిలో దిగారు. 

టీడీపీ, బీజేపీలను కలుపుకుని జగన్‌తో యుద్ధం చేస్తున్నారు. భీమవరం, గాజువాకల నుంచి కాకుండా ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్ధులను గెలిపించాలంటూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయనను ఎన్నికల రణక్షేత్రంలో గెలిపించేందుకు ఈసారి మెగా ఫ్యామిలీ కూడా కంకణం కట్టుకున్నట్లే పరిస్ధితులు కనిపిస్తున్నాయి.

జనసేనను పెట్టిన నాటి నుంచి మౌనంగా వున్న చిరంజీవి తొలిసారిగా తమ్ముడికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే నాగబాబు తనయుడు హీరో వరుణ్ తేజ్ బాబాయ్ కోసం ప్రచారం చేయడానికి పిఠాపురంలో దిగాడు. త్వరలోనే మిగిలిన మెగా కాంపౌండ్ కూడా కదిలివచ్చే అవకాశాలు లేకపోలేదు. 

ఇదిలావుండగా .. ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తూ వుండటంతో పవన్ నటించిన సూపర్ హిట్ మూవీ వకీల్ సాబ్ థియేటర్లలో మరోసారి సందడి చేయనుంది. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రీ రిలీజ్ కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాత దిల్‌రాజు ఆల్రెడీ అనౌన్స్ చేసేశాడు. బాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రం ‘పింక్’ రీమేక్‌గా ఈ సినిమాలో విశ్వరూపం చూపించారు పవన్ కళ్యాణ్. 

ప్రేక్షకులు చిత్రాన్ని బాగానే ఆదరించినప్పటికీ అప్పట్లో కరోనా ప్రభావం, ఇతరత్రా కారణాలతో ఆశించిన స్థాయిలో రిజల్ట్ దక్కలేదనే బాధ పవన్ అభిమానుల్లో వుంది. ఇప్పుడు రీ రిలీజ్‌లో మాత్రం దుమ్మురేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు  జరగనున్నాయి. మే 1 నుంచి పోలింగ్ జరిగే 13 వ తేదీకి పెద్ద గ్యాప్ లేకపోవడంతో పవన్‌కు, జనసేనకు కలిసొస్తుందనే చర్చ జరుగుతోంది. 

రెండేళ్ల క్రితం వకీల్ సాబ్ రిలీజ్ సమయంలో ఈ సినిమాకు జగన్ సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం అడ్డంకులు కల్పించిందంటూ పవన్ అభిమానులు రగిలిపోయారు. టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వకపోవడాన్ని వారు మరిచిపోలేదు. దీని వల్ల కొన్ని ప్రాంతాల్లో సినిమాకు నష్టాలు కూడా వచ్చాయి. దీనిని దృష్టిలో వుంచుకుని రీ రిలీజ్‌ను మాత్రం గ్రాండ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంలో పవన్ అభిమానులు ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సీజన్‌లో ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. 


Comments