ICC Under-19 Men's Cricket World Cup: విశ్వవిజేతగా యువ భారత్.. ఆరవసారి కప్ కొట్టిన టీమిండియా
Photo Courtesy: x.com/BCCI
అండర్ 19 వన్డే ప్రపంచకప్ 2026లో టీమిండియా తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆరోసారి అండర్ 19 వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించింది. హరారెలో శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఏకంగా 100 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును మట్టికరిపించి సగర్వంగా అండర్ 19 వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది టీమిండియా.
భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండో 40.2 ఓవర్లలో 311 పరుగుల ఆలౌట్ అయ్యింది. ఫాల్కనర్ సెంచరీతో (115) ఒంటరి పోరాటం చేసినప్పటికీ అతనికి సహకరించేవారు లేక జట్టు ఓటమి పాలైంది. ఇంగ్లీష్ ఆటగాళ్లలో బెన్ డాకిన్స 66, బెన్ మేయెస్ 45, థామస్ రేవ్ 31 పరుగులు చేశారు. భారత బౌలర్ల అంబరీష్ 3, దీపేశ్, కనిష్క్‌లు తలో 2 వికెట్లు తీయగా.. ఖిలాన్ పటేల్, ఆయుష్ మాత్రేలు తలో వికెట్ పడగొట్టారు.
తొలుత టాస్ గెలిచిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (175) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి.. జట్టు భారీ స్కోరు చేడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే 53, అభిజ్ఞాన్ కుందు (40), వేదాంత్ త్రివేది (32) పరుగులు చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో జేమ్స్ మింట 3, మోర్గాన్, అలెక్స్ గ్రీన్‌లు తలో 2 వికెట్లు పడగొట్టగా.. మానీ ఒక వికెట్ తీశారు.
1988లో అండర్ 19 వన్డే వరల్డ్ కప్‌కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రూపకల్పన చేసింది. ఈ మెగా టోర్నీలో భారత జట్టుది తిరుగులేని రికార్డ్. మొత్తం 6 సార్లు టీమిండియా ఈ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 4 సార్లు, పాకిస్తాన్ రెండు సార్లు, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాయ, వెస్టిండిస్‌లు తలో ఒకసారి కప్ గెలిచాయి. 37 ఏళ్ల ఈ ట్రోఫీ చరిత్రలో న్యూజిలాండ్, శ్రీలంకలు ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయాయి.

Comments
Post a Comment