మగాళ్లకు ఫ్రీ బస్సు.. ఉచితంగా ఫ్రిజ్.. అన్నాడీఎంకే హామీలు విన్నారా?
త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. డీఎంకేకు చెక్ పెట్టి ఈసారి అధికారాన్ని అందుకోవాలని అన్నాడీఎంకే.. రెండోసారి కూడా పవర్‌ని కంటిన్యూ చేయాలని డీఎంకే గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇక డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎదిగే లక్ష్యంతో కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ తన టీవీకేతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
తమిళనాడు ఎన్నికలు అంటేనే భారీగా ఉంటాయని దేశంలో పేరు. ఓటర్లను ఆకర్షించడానికి అనేక ఆఫర్లను, హామీలను, పథకాలను ఆయా పార్టీలు పోటీపడుతుంటాయి. ఈసారి కూడా ప్రజలకు భారీ హామీలతో పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. దీనిలో భాగంగా అన్నాడీఎంకే పలు ప్రజాకర్షక పథకాలతో ముందుకొచ్చింది. రాష్ట్రంలో అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో బీజేపీ, పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ(ఎం), పీబీకే, పీబీకే, పీడీకేలు ఒక కూటమిగా ఉన్నాయి. సోమవారం ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీ పూర్తయ్యింది.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి మార్చి 30న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 9. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ పేర్కొంది. మే 4న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు.
అభ్యర్థల ఎంపిక, సీట్ల పంపిణీ, పొత్తులు ఖరారు కావడంతో తమిళనాడులో ఎన్డీయే కూటమి ప్రచారంపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏఐఏడీఎంకే పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కనివినీ ఎరుగని హామీలతో అన్నాడీఎంకే షాకిచ్చింది.
ఏఐఏడీఎంకే మేనిఫెస్టో- 2026
- రేషన్ కార్డ్ కలిగిన కుటుంబాలకు ఉచిత ఫ్రిజ్‌లు
- మహిళలతో సమానంగా పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం
- 25 వేల సబ్సిడీతో రాష్ట్రంలోని 5 లక్షల మంది మహిళా ఉద్యోగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ
- బ్యాంకుల్లో తీసుకున్న విద్యా రుణాలు మాఫీ
- రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్ధిక సాయం
- రేషన్ కార్డ్ ఉన్న వారికి నెలవారి కోటా కింద బియ్యంతో పాటు ఉచితంగా కేజీ కందిపప్పు, కేజీ మంచి నూనె
- రాష్ట్రంలోని కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు
- ఫించను మొత్తం 2 వేల రూపాయలకు పెంపు
- జల్లికట్లు ఆటలో పాల్గొనే వారి కుటుంబాలకు 10 లక్షల ఆర్ధిక సాయం
.jpg)
Comments
Post a Comment