హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. ఏపీ వాసులకి చల్లని కబురు
హైదరాబాద్‌లో మంగళవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం చిరు జల్లులతో ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్, చింతల్‌లో భారీ వర్షం కురిసింది. దాంతో సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు బయల్దేరిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం తగ్గే వరకు మెట్రో పిల్లర్ల కింద వాహనదారులు బారులు తీరారు.
రోడ్లపైకి వర్షపు నీరు పోటెత్తి, మోకాలి లోతులో వరద నీరు ప్రవహించింది. యూసుఫ్‌గూడ, శ్రీకృష్ణనగర్ ఏరియాలలో భారీగా నీరు రోడ్ల మీదకు దూసుకొచ్చి కాలనీలను ముంచెత్తింది. ఈ ప్రవాహంలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. చాలా ఏరియాలలో భారీ ట్రాఫిక్ జాంలు చోటు చేసుకోవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రంగంలోకి దిగిన జీహెఎంసీ, హైడ్రా, పోలీస్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. వేసవి కారణంగా గత కొంతకాలంగా ఎండ వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ నగర ప్రజలు తాజా వర్షంతో కాస్త సేదతీరారు.
మరోవైపు.. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోఫి కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రాగల 72 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments
Post a Comment