తమిళనాడులో ఎన్డీయే సీట్ల పంపకం పూర్తి... ఒంటరిగా మిగిలిన దళపతి విజయ్
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యలో తమిళనాడులో రాజకీయ పార్టీలు పొత్తులు, సీట్ల పంపకంలో తలమునకలై ఉన్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటు ఈసారి అదృష్టం పరీక్షించుకోనున్న కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్‌కి చెందిన తమిళగ వెట్రి కళగంపైనే అందరిచూపు నెలకొంది. కాంగ్రెస్, బీజేపీలు విజయ్‌ని పొత్తుల్లోకి తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ.. ఆయన ససేమిరా అనడంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా అన్నాడీఎంకే - బీజేపీ కూటమి సీట్ల పంపకాలను పూర్తి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏలుతున్న మమతా బెనర్జీ ఈసారి కూడా పట్టు నిలుపుకుంటారా? లేక బీజేపీకి అధికారాన్ని అప్పగిస్తారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇక దక్షిణాదిన పెద్ద రాష్ట్రంగా ఉన్న తమిళనాడు మరింత ఆసక్తికిని రేపుతోంది.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి మార్చి 30న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 9. అన్ని స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే రోజున ఎన్నికలు జరగనున్నాయి, మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్, ఎంఎంకే, కేఎండీకే, ఎంఎన్ఎం, డీఎండీకే ఒక కూటమిగా ఉన్నాయి. అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో బీజేపీ, పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ(ఎం), పీబీకే, పీబీకే, పీడీకేలు ఒక కూటమిగా ఉన్నాయి. పీఎంకే(ఆర్), ఏఐపీటీఎంఎంకేలు మరో కూటమిగా బరిలో నిలిచాయి. దళపతి విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ కూడా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నాయి.
తాజాగా ఎన్డీయే కూటమిలో ఎన్నికల్లో పొత్తులు ముగిశాయి. చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన భేటీలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి, బీజేపీ తరపున కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, పీఎంకే చీఫ్ అన్బుమణి రామదాస్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకర్‌లు పాల్గొన్నారు. పొత్తుల్లో భాగంగా తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు గాను 27 స్థానాల్లో బీజేపీ, 18 చోట్ల పీఎంకే, ఏఎంఎంకేకు 11 సీట్లు కేటాయించగా.. మిగిలిన 170 స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ చేయనుంది.
మరోవైపు.. డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఏవో కొన్ని స్థానాలకు తప్పించి చాలా వరకు తమ మిత్రపక్షాలకు సీట్లు కేటాయించారు. అయితే ప్రస్తుతం అందరిచూపు కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్‌పైనే ఉంది. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన సీట్ల కేటాయింపు ఎలా చేస్తారు? ఎవరికి సీట్లు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. విజయ్‌ని ఎన్డీయే కూటమిలోకి తీసుకురావడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి కూడా ఆఫర్ చేసింది. అయితే టీవీకే నుంచి సానుకూల స్పందన రాలేదు.
ఈరోజు తమిళనాడులో ఎన్డీయే కూటమి పొత్తులు, సీట్లు ఖరారు చేయడంతో విజయ్ ఒంటరిగానే బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. అయితే క్షేత్రస్థాయిలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ దళపతికి కత్తిమీద సాములా తయారైంది. ఆర్ధిక, రాజకీయ సమీకరణలు, ఇతర అంశాలు విజయ్‌కి ఏమాత్రం మింగుడు పడటం లేదు. అభ్యర్ధులుగా పోటీ చేసేవారు కనీసం 5 కోట్ల రూపాయల ఖర్చును భరించగలిగే స్థోమత ఉంటేనే టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉందంటూ టీవీకే అంతర్గత చర్చలు బయటకు రావడం వివాదాస్పదమైంది.
తమిళ రాజకీయ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకేల అంగబలం, అర్ధబలాన్ని ఎదురొడ్డి నిలబడటం అంత తేలిక కాదని టీవీకే అధినేతతో పాటు ఆ పార్టీ కేడర్‌కు తెలియనది కాదు. వారితో పోటీపడాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉండటంతో గెలిచే స్థానాలు తప్పించి, రిస్క్ ఉన్న చోట ధైర్యం చేసేందుకు టీవీకే ఆశావహులు సిద్ధంగా లేరన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టీవీకే టికెట్ల కోసం మొదట 10 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఈ సంఖ్య 7 వేలకు పడిపోయిందని వార్తలు వస్తున్నాయి. దాంతో అసలు రాష్ట్రంలోని 234 స్థానాలకు విజయ్ తన అభ్యర్ధులను నిలబెడతారా? లేక బలమున్న చోటే బరిలో దిగుతారా అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి అనిశ్చితి వేళ దళపతి తన టీవీకేను ఎలా ఎన్నికలకు సిద్ధం చేస్తారనేది ఆసక్తిగా మారింది.
.jpg)
Comments
Post a Comment