పాపులారిటీలో వరల్డ్ నెంబర్‌వన్‌గా మోడీ... ట్రంప్ స్థానం ఎక్కడంటే?

 


వరల్డ్ లీడర్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి సత్తా చాటారు.  పాపులారిటీ పరంగా ప్రపంచ నేతల్లో తొలి స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ మార్నింగ్ కన్సల్ట్ బుధవారం విడుదల చేసిన ఈ జాబితాలో మోడీ అగ్రస్థానంలో నిలిచారు. అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ వంటి శక్తివంతమైన నేతలను దాటుకుని మోడీ ఈ ప్లేస్‌లో నిలవడం విశేషం. 

ఈ  సర్వే ప్రకారం.. ప్రపంచంలోని నేతలు అందరిలోకి మోడీకి 68 శాతం అప్రూవల్  రేటింగ్ వచ్చింది. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 26 శాతం మంది మాత్రమే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించారు.  6 శాతం మంది మాత్రం తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని తెలిపారు. 

మోడీ తర్వాత స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ (62 శాతం), దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే- మ్యుంగ్ (62 శాతం) అప్రూవల్ రేటింగ్‌తో నిలిచారు. ప్రధాని మోడీకి, ఇతర పాశ్చాత్య నేతలకు మధ్య అప్రూవల్ రేటింగ్ గణనీయమైన అంతరం కనిపిస్తున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. ఇరాన్‌తో ఇటీవల తలెత్తిన యుద్ధ పరిణామాల ప్రభావంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 39 శాతానికి పడిపోయింది. యూరప్ నేతలలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ (24 శాతం), జర్మనీకి చెందిన ఫ్రెడరిక్ మెర్జ్ (20 శాతం) సాధించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (17 శాతం) అప్రూవల్ రేటింగ్‌ సాధించగా.. వ్యతిరేకత 75 శాతంగా ఉంది. 

ఈ గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్‌లోని గణాంకాలు మోడీకి దేశీయంగా ఉన్న ఆదరణతో పాటు ఆయనకు పెరుగుతున్న అంతర్జాతీయ గుర్తింపును నొక్కి చెబుతోంది. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్ధిక వ్యవస్థలకు చెందిన అధినేతల కంటే ఆయన ముందంజలో ఉన్నారు. ఇప్పుడే కాదు.. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ జూలై 2025లో విడుదల చేసిన నివేదికలోనూ మోడీయే నెంబర్ వన్‌గా నిలిచారు. నాడు ఏకంగా 75 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ప్రధాని ఆధిపత్యం చూపించారు. 

మే 2024లో వరుసగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన నరేంద్ర మోడీ.. తన పదవీకాలానికి సంబంధించిన కీలకమైన మైలురాయిని చేరుకోనున్నారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించి మొత్తంగా ఇప్పటి వరకు 4079 రోజులను పూర్తి చేసుకున్నారు. తద్వారా ఇందిరా గాంధీని అధిగమించి భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా నరేంద్రమోడీ నిలిచారు. ఈ లిస్ట్‌లో తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ టాప్‌లో ఉన్నారు. 


Comments