సినీ కెరీర్‌కు నటి త్రిష గుడ్‌బై? స్టార్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్

 


ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో.. మరీ ముఖ్యంగా తమిళనాడు సినీ, రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు త్రిష కృష్ణన్. కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నారంటూ కొద్దిరోజుల క్రితం తమిళనాడు బీజేపీ చీఫ్ నాయనర్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదానికి తెరపడింది. 

ఇది జరిగిన  కొద్దిరోజులకే దళపతి విజయ్ సతీమణి సంగీత సోర్ణలింగం షాకిచ్చారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళ సినీరంగానికి చెందిన ఓ నటితో తనకు భర్తకు వివాహేతర సంబంధం ఉందని, ఆమె కారణంగా మా ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే అందులో నటి పేరును మాత్రం ఆమె ప్రస్తావించలేదు. కానీ అందరి చూపు త్రిషపైనే పడింది.

టీవీకే పార్టీ ద్వారా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విజయ్‌కి ఈ పరిణామాలు ఇబ్బంది కలిగించాయి. అయితే ఆ వెంటనే ఓ నిర్మాత ఇంట్లో పెళ్లి వేడుకకు త్రిషతో కలిసి విజయ్ జంటగా హాజరుకావడంతో సంచలనం  సృష్టించింది. దాంతో విజయ్ - త్రిషల రిలేషన్ నిజమేనంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఈ క్రమంలో త్రిషపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. 

అయితే త్రిష రాజకీయాల్లోకి అడుగుపెడతారని, తమిళనాడు సీఎం కావాలన్నది ఆమె కల అని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్వయంగా త్రిష సైతం తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని పలుమార్లు బయటపెట్టారు. తాజాగా వీటికి బలం చేకూర్చేలా సీనియర్ దర్శకుడు చిత్రా లక్ష్మణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

త్రిష త్వరలోనే తన సినీ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారని బాంబు పేల్చారు. కొంతమంది నిర్మాతలను త్రిష గురించి అడగ్గా.. ఆమెకు సినిమాల్లో కొనసాగాలని లేదని చెప్పారని లక్ష్మణన్ అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై త్రిష స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం త్రిష కృష్ణన్ సూర్య సరసన కరుప్పు, మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర.. మలయాళంలో రామ్ చిత్రాలలో నటిస్తున్నారు.  


Comments