MK Stalin: ఎంకే స్టాలిన్‌‌‌కు బిగ్‌షాక్.. టీవీకే అభ్యర్ధి చేతిలో సీఎం ఓటమి

 

2026 తమిళనాడు ఎన్నికలు ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)కు పీడకలను మిగిల్చాయి. రెండోసారి అధికారంలోకి వస్తామని కలలు కన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆశలు గల్లంతయ్యాయి. డీఎంకేదే ఈసారి విజయమని అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేయగా.. దళపతి విజయ్ అన్ని అంచనాలను తారుమారు చేశారు. దాదాపు 110 స్థానాల్లో విజయంతో మేజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో నిలిచారు. అన్నాడీఎంకే లేదా చిన్నా చితకా పార్టీల సాయంతో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇక ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు ఓటర్లు షాకిచ్చారు. పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోవడంతో పాటు ఆయన స్వయంగా ఓడిపోయారు. కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్‌పై టీవీకే అభ్యర్ధి వీఎస్ బాబా దాదాపు 9 వేల ఓట్ల తేడాతో విజయం సాధించడం డీఎంకే కేడర్‌కు షాకిస్తోంది. ఎన్నికల్లో అధికారానికి దూరం కావడాన్ని మించి స్టాలిన్ ఓటమి డీఎంకే శ్రేణులను తీవ్ర నైరాశ్యంలో ముంచేసింది. 

తమిళ రాజకీయ దిగ్గజం, దివంగత కరుణానిధి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన స్టాలిన్.. 1989లో థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన స్టాలిన్ తొలిసారిగా తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1996, 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుంచి గెలుపొందారు. 2011 నుంచి తన స్థానాన్ని కొలత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్‌కు మార్చుకుని 2016, 2021 ఎన్నికలలో విజయం సాధించారు స్టాలిన్. 

అయితే 2026లో మాత్రం స్టాలిన్‌కు కొలత్తూరు ప్రజలు షాకిచ్చి వీఎస్ బాబుకు పట్టం కట్టారు. వీఎస్ బాబు మాజీ డీఎంకే నేత. స్టాలిన్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. విజయ్ స్థాపించిన టీవీకేలో చేరి తన మాజీ బాస్‌ని ఓడించారు. కౌంటింగ్ స్టార్ట్ చేసిన నాటి నుంచి స్టాలిన్- బాబు మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరికి టీవీకే అభ్యర్ధి వీఎస్ బాబుకి 82110 ఓట్లు పోలవ్వగా.. సీఎం స్టాలిన్‌కు 72988 ఓట్లు మాత్రమే పోలై ఓటమి పాలయ్యారు. 


Comments