జనగణనకు ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే?
దాదాపు 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయే జనగణనకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జూన్ 16న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జనగణన 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. అంతేకాదు.. ఈ జనగణన బ్రిటీష్ హయాంతో కలుపుకుని 16వ సారి కాగా.. స్వతంత్ర భారతంలో 8వది.
ఈ భారీ కార్యక్రమం కోసం దాదాపు 34 లక్షల మంది గణకులు, సూపర్ వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది సేవలు అందించనున్నారు. తొలిసారిగా జనగణనతో పాటు కుల గణను కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ పోర్టల్స్ ద్వారా ప్రజలే వ్యక్తిగతంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది. జనగణన చట్టం 1948, సెక్షన్ 3 ప్రకారం జన- కులగణనను చేపడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది.
జమ్మూకాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో 2026 అక్టోబర్ 1 నుంచి తొలిదశలో.. 2027 మార్చి 1 నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జనగణనను చేపట్టనున్నారు. దేశంలో 1872 నుంచి జనాభాను లెక్కిస్తున్నారు. దశాబ్ధానికి ఒకసారి జనగణన చేపట్టాలని నిర్ణయించారు. చివరిసారిగా 2011లో జనగణన చేపట్టారు. తర్వాత 2021లో జనాభాను లెక్కించాలి.. అయితే ఆ సమయంలో భారతదేశంలో కోవిడ్ భీకరంగా ఉంది. ఈ పరిస్ధితులతో కేంద్రం జనగణనను వాయిదా వేసింది.
తాజాగా పరిస్ధితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో జనగణనకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి ప్రతి ఒక్కరూ తమ కులాన్ని చెప్పే ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అలగే జనగణనకు కేంద్రం రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చు చేసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Post a Comment