హరిహర వీరమల్లు... నిరాశలో పవన్ సైన్యం
రాజకీయాల్లోకి వెళ్లి, పదేళ్ల పోరాటం తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నుంచి శాసనసభ్యుడు కావడంతో పాటు చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగానూ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, తన ఆశయాలకు అనుగుణంగా అత్యంత కీలకమైన శాఖలను స్వీకరించిన పవన్ దూసుకెళ్తున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా సక్సెస్ కావడంతో ఆయన అభిమానులకు ఓ పక్క సంతోషంగా ఉన్నప్పటికీ, మరోవైపు పవన్‌ను వెండితెర మీద చూడలేమని బాధపడ్డారు. సినీ పరిశ్రమను వదిలిపెట్టి రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమయ్యేసరికి పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు సినిమాకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కరోనా, లాక్‌డౌన్, పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో దాదాపు ఐదేళ్లుగా సినిమా ఆగిపోయింది.
తొలుత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన క్రిష్ జాగర్లమూడి ఈ ఆలస్యంతో వీరమల్లు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నాన్ని ఇది మరింత ఇరకాటంలో నెట్టింది. క్రిష్ సూచన మేరకు ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టుకుని మిగిలిన పార్ట్ పూర్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. పవన్‌తో సంబంధం లేని సన్నివేశాలను జ్యోతికృష్ణ వేగంగా పూర్తి చేశారు. ఈలోపు పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్‌లో చేరి వీరమల్లును విడుదలకు సిద్ధం చేశారు.
జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుందని మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ వార్తతో మెగా, పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రెండేళ్ల విరామం తర్వాత పైగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ నటించిన సినిమా విడుదల కానుండటంతో ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అటు విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ సైతం ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.
చెన్నైలో ఓ పాటను లాంచ్ చేసిన వీరమల్లు యూనిట్.. జూన్ 8న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. జూన్ 7 నాటికే పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకుని, తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా హరిహర వీరమల్లు వాయిదా అంటూ సోషల్ మీడియాలో, మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇంత జరగుతున్నా పవన్ క్యాంప్ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. ఇంతలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అంటూ మరో న్యూస్ చక్కర్లు కొట్టింది.
సీజీ వర్క్ పూర్తి కాకపోవడం వల్లే వీరమల్లు వాయిదా పడిందని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ అసలు కారణం ఏంటి? ఇంతకీ సినిమా జూన్ 12న విడుదల అవుతుందా? లేదా? అన్న దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం స్పందించాలని పవన్ అభిమానులు కోరుతున్నారు.
Comments
Post a Comment