బెంగళూరు సతమతం , మహారాష్ట్రకు పాకిన నీటి సంక్షోభం .. వాడకంపై పూణే కార్పోరేషన్ ఆంక్షలు

 



భారతదేశంలోని ప్రధాని నగరాలు ఎన్నడూ లేనివిధంగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే దేశ ఐటీ రాజధాని, గార్డెన్ సిటీ బెంగళూరులో నీటి సంక్షోభం తారా స్థాయికి చేరింది. కనీస అవసరాలు పక్కనబెడితే.. గొంతు తడుపుకునేందుకు కూడా నీటి చుక్క దొరకని పరిస్దితి నెలకొనడంతో బెంగళూరు మహానగరం అల్లాడుతోంది. 

Also Read : ప్రపంచంలోనే అత్యంత రద్దీగా వుండే విమానాశ్రయాలు .. టాప్ 10లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే..?

భూగర్భజలాలు అడుగంటంతో పాటు కావేరీ నదీ జలాల లభ్యత లేకపోవడంతో ప్రజలకు నీటిని సరఫరా చేయలేక అక్కడి జలమండలి చేతులేత్తెసింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకు సరిపోవడం లేదు. 

ఇదిలావుండగా.. ప్రస్తుతం బెంగళూరును వణికిస్తున్న నీటి సంక్షోభం పక్కనేవున్న మహారాష్ట్రకు కూడా పాకింది. రాష్ట్రంలోని ప్రధాన ఆనకట్టల్లో నీటిమట్టం తగ్గిపోవడంతో మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో పూణే మున్సిపల్ కార్పోరేషన్ నగరంలో నీటి వినియోగంపై ఆంక్షలు విధించింది. 

రాష్ట్రంలోని ప్రధాన డ్యామ్‌లలో నీటిమట్టాలు వాటి మొత్తం నిల్వ సామర్ధ్యంలో 32.72 శాతానికి పడిపోయిన కారణంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయి. పూణేలోని ఖడక్ వాస్లా, టెమ్‌ఘర్, పన్‌షెట్, వరాస్‌గావ్ వంటి నాలుగు ప్రధాన డ్యామ్‌లలో గతేడాది ఇదే రోజున 12.91 టీఎంసీల నీరు వుండగా.. ప్రస్తుతం అది 10.31 టీఎంసీలకు పరిమితమైంది. 

Also Read : మన సరబ్‌జిత్ సింగ్‌ను చంపిన పాకిస్తాన్ డాన్ హతం

మహారాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన ఓ అధికారి జాతీయ వార్తాసంస్థ హిందూస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే ఈ వేసవి మరింత వేడిగా వుందని, తక్కువ వర్షపాతం కారణంగా డ్యామ్‌లలో నీటి మట్టాలు తగ్గిపోయాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వున్న 138 ప్రధాన డ్యామ్‌లు వాటి మొత్తం నిల్వ సామర్ధ్యంలో 32.72 శాతం మాత్రమే కలిగి వున్నాయని ఆయన వెల్లడించారు. ఇది గతేడాతో పోలిస్తే 7.1 శాతం తగ్గుదల. 

పూణేలో నీటి వినియోగంపై ఆంక్షలు :

తీవ్రమైన నీటి సంక్షోభం నేపథ్యంలో పూణే మున్సిపల్ కార్పోరేషన్ నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. కార్లను కడగటానికి కార్పోరేషన్ సరఫరా చేసే నీటిని ఉపయోగించవద్దని కార్ వాషింగ్ సెంటర్‌లను ఆదేశించింది. నిర్మాణ కార్యకలాపాలకు మురుగునీటి శుద్ధి కర్మాగారం (ఎస్టీపీ) నీటిని ఉపయోగించాలని సూచించింది. 

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా :

విపరీతమైన నీటి ఎద్దడితో గ్రామాలు ఇబ్బందులు పడుతుండటంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. 34 విలీన గ్రామాలలో నీటి సరఫరా సరిగా లేదనే ఫిర్యాదుల కారణంగా నీటి ట్యాంకర్ ట్రిప్పులను పెంచినట్లు పూణే మున్సిపల్ కార్పోరేషన్ (పీఎంసీ) ఒక ప్రకటనలో తెలిపింది. 

సుస్, మహాలుంగే, పిసోలి, హోల్కర్ వాడి, పుర్సుంగి, ఉరుళి, కాటారి వంటి ప్రాంతాల్లో నీటి డిమాండ్‌ను పరిష్కరించేందుకు , 34 విలీన గ్రామాలలో 11 గ్రామాలకు 300 నీటి ట్యాంకర్లను , మిగిలిన 23 గ్రామాలకు 800 నీటి ట్యాంకర్లను పంపుతోంది. ఈ ప్రాంతాల్లో నీటి ప్రవాహం , లభ్యత కనిష్ట స్థాయిలో వుండటంతో ట్యాంకర్లలో నీటి సరఫరాను పది శాతం పెంచాల్సి వచ్చిందని పూణే నగరపాలక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

పలు ప్రాంతాల్లో నీటి నిల్వ :

హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని పలు డివిజన్లలో నీటి మట్టం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలోని మరఠ్వాడా డివిజన్‌లో అత్యల్ప నీటి నిల్వ 19.36 శాతం.. పూణే డివిజన్ 36.34 ాతం, నాగపూర్ డివిజన్ 48.84 శాతం, అమరావతి డివిజన్ 49.62 శాతం, నాసిక్ డివిజన్ 38.17 శాతం, కొంకణ్ డివిజన్ 50.50 శాతంగా వున్నాయి. 

ప్రధాన ఆనకట్టల్లో భయపెడుతోన్న నీటిమట్టాలు :

మహారాష్ట్రలో మొత్తం 138 ప్రధాన ఆనకట్టలు వున్నాయి. వాటిలో 17 పూర్తిగా ఎండిపోయాయి. 23 ఆనకట్టల్లో 10 శాతం కంటే తక్కువ నీటి నిల్వ వుంది. 20 వాటిలో 50 శాతం కంటే ఎక్కువ నీటి నిల్వ వుంది. మిగిలిన డ్యామ్‌లలో 20 నుంచి 40 శాతం నీటి నిల్వ వుంది. 


Comments