ఘోర విమాన ప్రమాదం... మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం

 


బుధవారం మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఈ వార్తతో మహారాష్ట్రతో పాటు యావత్ దేశం ఉలిక్కిపడింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా విమానం కుప్పకూలినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌ సహా ఐదుగురు దుర్మరణం పాలైనట్లుగా తెలుస్తోంది. వీరిలో ఇద్దరు పైలట్స్, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అజిత్ పవార్ ప్రస్థానం:

1959 జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా దేయ్‌లాలీ ప్రవరలో జన్మించారు అజిత్ పవార్. ఆయన తండ్రి అనంతరావ్ పవార్. ఈయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కి స్వయాన అన్నయ్య. చదువు పూర్తి చేసిన తర్వాత రాజకీయాలపై ఆసక్తితో బాబాయ్ శరద్ పవార్ శిష్యరికంలో అడుగులువ వేశారు అజిత్. 1982లో తొలిసారిగా కార్పోరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డ్‌కు ఎన్నికయ్యారు. అనంతరం మహారాష్ట్రలో బలమైన సహకార సంఘాలపై పట్టు సాధించిన పవార్.. 16 ఏళ్ల పాటు పుణె జిల్లా కేంద్ర సహకార కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

1991లో తొలిసారిగా తన కుటుంబ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ దశలో శరద్ పవార్ కేంద్రంలో చక్రం తిప్పేందుకు వీలుగా బాబాయ్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు 1991లో బారామతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత అజిత్ పవార్ సొంతం. 

పలుమార్లు మంత్రిగా పనిచేసిన అజిత్ పవార్... ముఖ్యంగా ఆర్ధిక శాఖపై బలమైన ముద్ర వేశారు. పలుమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు మహారాష్ట్రకు పాలసీలు రూపొందించారు. బాబాయ్ శరద్ పవార్‌కు కుడిభుజంగా ఉంటూ మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు. అయితే గత మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బాబాయ్ శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చారు. తన వర్గం ఎమ్మెల్యేలతో ఎన్డీఏలో చేరి వ్యూహాత్మకంగా పార్టీని, ఎన్సీపీ గుర్తును సొంతం చేసుకున్నారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా.. ఆర్ధిక, ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ వ్యవహారాల శాఖలను నిర్వహిస్తున్నారు. గతంలోనూ పలువురు ముఖ్యమంత్రులకు డిప్యూటీ సీఎంగా వ్యవహరించి.. మహారాష్ట్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు అజిత్ పవార్.

మహారాష్ట్రలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాల్లోనూ అజిత్ పవార్‌కు సన్నిహితులు ఉన్నారు. రాజకీయ, సినీ, వ్యాపార, తదితర రంగాల ప్రముఖులతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేయడంతో పాటు భవిష్యత్‌లో సీఎం అవుతారని అంతా భావిస్తున్న వేళ అజిత్ పవార్ విమాన ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్ పవార్ హఠాన్మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తదితరులు సంతాపం తెలియజేస్తున్నారు. 

Comments