Jaahnavi Kandula: అమెరికాలో తెలుగు విద్యార్ధిని మృతి... బాధితురాలికి 262 కోట్ల నష్టపరిహారం
ఐదేళ్ల క్రితం అమెరికాలోని సియాటెల్ నగరంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగు విద్యార్ధిని జాహ్నవి కందుల కుటుంబానికి ఊరట లభించింది. బాధిత కుటుటంబానికి దాదాపు 262 కోట్ల రూపాయల నష్టపరిహారం దక్కింది. అసలు ఈ కేసు ఏంటీ? జాహ్నవి ఎలా చనిపోయారు? ఈ కేసులో వివాదం ఏంటీ? అనే పూర్వాపరాల్లోకి వెళితే.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల 2021లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. అనంతరం సౌత్‌లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందారు. ఈ దశలో 2023 జనవరి 23వ తేదీ రాత్రి రోడ్డు దాటుతుండగా అదే సమయంలో అటువైపు వేగంగా వస్తోన్న పోలీస్ వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తుందనుకున్న తమ బిడ్డ తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో జాహ్నవి కుటుంబ సభ్యలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అయితే అమెరికాలో తీవ్ర సంచలనం సృష్టించిన జాహ్నవి మృతి కేసుపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో అక్కడి ప్రభుత్వం విచారణ చేయించింది. ప్రమాదానికి కారణమైన పోలీస్ వాహనాన్ని ఆ సమయంలో కెవిన్ డేవ్ అనే అధికారి డ్రైవ్ చేస్తున్నాడు. జాహ్నవిని ఢీకొట్టిన ప్రదేశంలో నిబంధనల ప్రకారం కారును 40 కి.మీ వేగంలో నడపాల్సి ఉంది. కానీ కెవిన్ మాత్రం వాహనాన్ని దాదాపు 119 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నాడు. అప్పటికే అతను డ్రగ్స్ మత్తులో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే కారుకున్న ఎమర్జెన్సీ లైట్లు ఆన్ చేసి.. కూడళ్ల వద్ద తన సైరన్‌ను ఉపయోగించినట్లు విచారణ తేలింది.
అటు జాహ్నవి మరణంపై స్థానికంగానూ నిరసనలు జరిగాయి. ఇదే సమయంలో మరో అధికారి బాడీ కెమెరా రికార్డింగ్స్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఇందులో కెవిన్ నవ్వుతూ.. జాహ్నవి మరణానికి విలువ లేదని వ్యాఖ్యానించడంతో అతనిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. అతని వ్యాఖ్యలు పోలీస్ శాఖ ప్రతిష్టను, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయని నగర పౌర వాచ్‌డాగ్ కనుగొంది. అయితే తనను విధుల నుంచి తప్పించడంపై కెవిన్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయవాదులు ఈ మరణంపై ఎలా స్పందిస్తారనే దానిపై విమర్శించేందుకే ఈ వ్యాఖ్యలు చేశానని దారుణంగా మాట్లాడాడు.
అయితే కందుల జాహ్నవి మరణానికి కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని ఆమె కుటుంబం న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. ఈ క్రమంలో గత శుక్రవారం కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో ఇరుపక్షాలు సెటిల్‌మెంట్ నోటీసు దాఖలు చేశాయి. దీనిలో భాగంగా జాహ్నవి కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 262 కోట్ల రూపాయలు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ కీలక ప్రకటన చేశారు. దీని ద్వారా జాహ్నవి కుటుంబానికి కాస్తయిన ఉపశమయనం లభిస్తుందని ఎరికా పేర్కొన్నారు. అయితే సెటిల్‌మెంట్‌పై జాహ్నవి తరపు న్యాయవాదులు ఇంకా స్పందించలేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Comments
Post a Comment