సిద్ధిపేటపై రేవంత్ కన్ను... హరీష్‌రావును గెలవడం అంత ఈజీయా?
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సిద్ధిపేటలో ఎమ్మెల్యేగా గెలిచిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించడం ఈ పొలిటికల్ హీట్‌కు కారణం. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా సిద్ధిపేటలో గెలిచినవారికి మంత్రి పదవి విషయాన్ని పక్కనపెడితే.. అసలు గెలిచే వ్యక్తి ఎవరు? అసలు సిద్ధిపేటలో గెలవడం అంత ఆషామాషీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం.. కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎంట్రీతో కల్వకుంట్ల కుటుంబానికి అడ్డాగా మారింది. 1985 నుంచి నేటి వరకు దాదాపు 40 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబ సభ్యులే ఇక్కడి నుంచి గెలుస్తున్నారంటే సిద్ధిపేటలో పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 1985, 89, 94, 99 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కేసీఆర్ వరుసగా గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలోకి దూకిన కేసీఆర్.. టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాదించారు.
2004లో ఎంపీగా పోటీ చేసిన కేసీఆర్.. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా అవకాశం దక్కడంతో సిద్ధిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు బదులుగా తన మేనల్లుడు తన్నీరు హరీష్‌రావుని ఉప ఎన్నిక బరిలో నిలబెట్టి గెలిపించారు కేసీఆర్. నాటి నుంచి సిద్ధిపేటలో హరీశ్‌రావు శకం మొదలైంది. 2009 అసెంబ్లీ ఎన్నికలు, 2010 ఉపఎన్నిక, 2014, 2018, 2023 ఎన్నికల్లో హరీష్‌రావు వరుస విజయాలు సాధించి డబుల్ హ్యాట్రిక్ అందుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ కేబినెట్‌లలో హరీష్‌రావుగా మంత్రిగా పనిచేశారు.
అధికారంలో ఉన్నా లేకున్నా సిద్ధిపేట అభివృద్ధిపై హరీష్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రత్యేక జిల్లా చేయడం దగ్గరి నుంచి, తాగునీరు, పక్కా రోడ్లు, డ్రైనేజీ, సుందరీకరణ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మాస్ లీడర్‌గా ఎదిగారు. హరీష్‌రావు అంటే సిద్ధిపేట.. సిద్ధిపేట అంటే హరీష్‌రావు అన్నంతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
సిద్ధిపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ప్రతి వార్డ్‌లో ఆయనకు మద్ధతుదారులు, సానుభూతిపరులు, అభిమాన గణం ఉంది. ఎన్నిక ఏదైనా సరే.. ఎప్పుడొచ్చినా సరే.. హరీష్‌రావుదే విజయమని ప్రత్యర్ధులు సైతం ఒప్పుకుంటారు. అలాంటి సిద్ధిపేటలో హరీష్‌ను కాదని వేరే పార్టీ జెండా ఎగరడం అసాధ్యమని స్థానికులు చెబుతున్నారు.
సిద్ధిపేటలో హరీష్‌ను ఢీకొనే స్థాయి నేతలు లేరు. ప్రధాన రాజకీయ పార్టీలకు ఇక్కడ బలమైన నేతలు లేరు. కాంగ్రెస్, బీజేపీలకు సరైన నేతలు, అభ్యర్ధులు లేరు. దీనికి తోడు బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌గా, చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న హరీష్‌రావు వ్యూహాల ముందు మరో నేత నిలబడగలరా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే దశాబ్ధాల బీఆర్ఎస్ కంచుకోటను బద్ధలు కొడతామని, సిద్ధిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
సిద్ధిపేటలో అభివృద్ది కార్యక్రమాలతో పాటు కేడర్ బలోపేతంపై సీఎం దృష్టి సారించారు. ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉండటంతో దీర్ఘకాలిక వ్యూహాన్ని రచిస్తున్నారు రేవంత్ రెడ్డి. సిద్ధిపేట కంచుకోటను బద్ధలు కొట్టేందుకు సీఎం స్థాయి వ్యక్తి బరిలో దిగడంతో పాటు దశాబ్థాల తన ఉనికిని కాపాడుకునేందుకు హరీష్‌రావు వ్యూహాల నేపథ్యంలో 2029 సిద్ధిపేట ఎన్నికల సమరం రసవత్తరంగా సాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Comments
Post a Comment