టాక్సిక్ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
కర్ణాటకకు చెందిన బడా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు అస్సలు టైం బాగున్నట్లుగా కనిపించడం లేదు. కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ సినీ కెరీర్‌లో చివరి మూవీ జన నాయగన్‌ను ఈ సంస్థే నిర్మించింది. తమ అభిమాన నటుడి చివరి సినిమా కావడంతో విజయ్ అభిమానులు కూడా జన నాయగన్ కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.
అయితే సెన్సార్ బోర్డ్ నుంచి అనుమతులు రాకపోవడం, న్యాయపరమైన చిక్కులు కారణంగా జన నాయగన్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. కట్ చేస్తే.. కన్నడ సూపర్‌స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్. కేజీఎఫ్ సిరిస్ తర్వాత యష్ నటిస్తున్న మూవీ కావడంతో టాక్సిక్‌పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు.
ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. అదే రోజున రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 విడుదల కానుండటంతో రెండు సినిమాలలో ఏది బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందోనని సినీ జనాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి దశలో టాక్సిక్ నిర్మాతలు షాకిచ్చారు. టాక్సిక్ : ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.
ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధంతో పాటు ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. జూన్ 4న భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌లో టాక్సిక్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. దాంతో యష్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Comments
Post a Comment