టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత.. స్టాలిన్‌ను ఓడించి సంచలన నేతగా!

ఈ ఏడాది ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాబు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 19వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

1951లో మద్రాస్ శివార్లలోని విల్లివక్కంలో జన్మించారు వీఎస్ బాబు. ఆయన పూర్తి పేరు వీ సుందర్రాం పిళ్లై. ఆయన రాజకీయ ప్రస్థానం డీఎంకే నుంచే మొదలైంది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో పురుసవాల్కం స్థానం నుంచి డీఎంకే అభ్యర్ధిగా గెలుపొందారు బాబు. అనంతరం పార్టీలో కీలక స్థానానికి ఎదిగి.. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై నార్త్ డిస్ట్రిక్ట్ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే కొత్తగా ఏర్పడిన కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో స్టాలిన్ విజయం కోసం క్షేత్రస్థాయిలో ముఖ్య భూమిక పోషించారు.

అయితే ఎన్నికల్లో ఊహించిన దానికంటే స్టాలిన్ భారీ మెజారిటీతో కాకుండా సాధారణ విజయం సాధించడంతో డీఎంకే అధిష్టానం సీరియస్ అయ్యింది. ఈ పరిణామాలతో ఆయనను ఆ పదవి నుంచి తొలగించింది. దాంతో 2016లో అన్నాడీఎంకే పార్టీలో చేరారు వీఎస్ బాబు. అయితే నాటి సీఎం జయలలిత మరణం, తదనంతర పరిణామాలతో ఏఐఏడీఎంకే నుంచి బయటికొచ్చి దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే)లో చేరారు వీఎస్ బాబు.

ఆయన అపార అనుభవం, క్షేత్రస్థాయిలో పరిచయాలను దృష్టిలో పెట్టుకుని విజయ్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా అప్పటి సీఎం ఎంకే స్టాలిన్ మీద వీఎస్ బాబుని పోటీకి దించారు. స్టాలిన్ అంగ బలం, అర్ధ బలం ముందు బాబు నిలబడలేరని ఓడిపోతారని విశ్లేషకులు సైతం అంచనా వేశారు. కానీ కొలత్తూరు ప్రజలు మాత్రం వీఎస్ బాబుకి పట్టం కట్టారు. నాటి ఎన్నికల్లో 82,997 ఓట్లు పోలై దాదాపు స్టాలిన్‌పై ఏకంగా 8795 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు వీఎస్ బాబు. దాంతో ఆయన పేరు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా మారుమోగింది. 

కాగా.. 75 ఏళ్ల వయసులోనూ రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటూ వస్తున్నారు వీఎస్ బాబు. అయితే సెప్టెంబర్ 9న శ్వాసకోస సంబంధిత అనారోగ్యంతో చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్‌లో చేరారు బాబు. నాటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం గురువారం విషమంగా మారింది. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురై తుది శ్వాస విడించారు. ఆయన మరణంతో టీవీకే శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి.

మరోవైపు.. తనను ఓడించి కొలత్తూరులో సంచలన విజయం సాధించిన వీఎస్ బాబు మరణంపై డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్ సైతం విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 



Comments