నన్ను మీ సినిమాల్లో పెట్టుకోండి... డాక్టర్ రాజశేఖర్ ఆవేదన
ఎవరు ఏమనుకున్నా చిత్ర పరిశ్రమ సక్సెస్ వెంట పరిగెత్తుతుందనేది కాదనలేని వాస్తవం. ఎన్ని కష్టాలు ఎదురైనా, అవమానాలు ఎదుర్కొన్నా... మధ్యలో ఆగిపోకుండా చివరి వరకు పోరాడే వాడే ఇక్కడ నిలబడగలుగుతాడు. ఈ రన్నింగ్ రేసులో పరిగెత్తలేక మధ్యలోనే ఆగిపోయిన వారు బ్లాక్ అండ్ వైట్ ఎరా నుంచి నేటి వరకు ఎందరో. తమ ముందుతరాల వారి జీవితాలను దగ్గరి నుంచి చూసిన కొందరు నటులు మాత్రమే చివరి వరకు నటిస్తూ తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు.
హీరోలుగా చేసినవారు హీరోలుగానే చేయాలనే గిరి గీసుకుని కూర్చొంటే బండి నడవటం ఎంతో కష్టమని ఎన్నో ఉదాహరణలు. హీరోలుగా వైభవాన్ని చూసినవారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్‌లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్ తదితర నటులు ఫ్యామిలీ హీరోలుగా వెలుగొంది... ఒక స్టేజ్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ముఖ్యంగా జగపతి బాబు కాలానికి తగినట్లుగా తనను తాను మార్చుకున్నారు. పవర్ ఫుల్ విలన్‌గా, స్టైలీష్ ఫాదర్‌గా మెప్పిస్తూ దక్షిణాదిలో డిమాండ్ ఉన్న నటుడిగా నిలిచారు.
తెలుగునాట యాంగ్రి యంగ్‌మెన్‌గా చరిత్ర సృష్టించి పవర్‌ఫుల్ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచారు డాక్టర్ రాజశేఖర్. తమిళ నటుడే అయినా తెలుగు ప్రజలు ఆయన్ను ఆదరించారు. వందేమాతరం, ప్రతిఘటన, అంకుశం, మగాడు, తలంబ్రాలు, అల్లరి ప్రియుడు, మా అన్నయ్య, మనసున్న మారాజు, సింహరాశి, ఎవడైతే నాకేంటీ తదితర చిత్రాలతో స్టార్ హీరో అనిపించుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ తర్వాత టాలీవుడ్‌లో అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజశేఖర్.
అయితే ఇదంతా గతం.. ఇప్పుడు రాజశేఖర్‌ను పట్టించుకునేవారు లేరు. ఆయన హిట్ కొట్టి చాలాకాలమే అయ్యింది. ఆపరేషన్ గరుడ వేగతో తిరిగి పూర్వ వైభవం అందుకున్నట్లు కనిపించినా... తర్వాత తీసిన కల్కి, అర్జున, దెయ్యం, శేఖర్, ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో రాజశేఖర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న బైకర్‌లో కీలకపాత్రలో పోషిస్తున్నారు రాజశేఖర్.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటిలు బైకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 3న ఈ సినిమా విడుదల కానుంది. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కుతోన్న బైకర్‌లో శర్వానంద్ రేసర్‌గా కనిసిస్తున్నారు. ఆయనకు తండ్రిగా రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రాజశేఖర్ ఉద్వేగంగా ప్రసంగించారు.
ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు హీరోగానే కాకుండా క్యారెక్టర్ రోల్స్ కూడా చేయాలని నిర్ణయించుకున్నా. అందరూ కథలు చెబుతున్నా.. నాకు సరైన సబ్జెక్ట్ రాలేదు. రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత అభిలాష్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పారు. ఈ కథ చాలా బాగా నచ్చింది.. శర్వానంద్ గారి సినిమాలో సెకండ్ హీరోగా అనుకున్నాను. కానీ తర్వాత నేను, జీవిత, నా పిల్లలు అందరం కలిసి మాట్లాడుకున్నాం.. మీరు చేయాలని అనుకుంటున్నారు, అలాగే ఉంటుంది కానీ చేయండని చెప్పి ఒప్పించారు. ఇటీవల సినిమాకు వెళ్లినప్పుడు మిమ్మల్ని తెరపై చూసి చాలాకాలం అయ్యింది.. మీ సినిమా ఎప్పుడు వస్తుందని అడిగారు. నెక్ట్స్ బైకర్ వస్తుంది.. నా సినిమా చూడండి అని చెప్పా.
అందరూ శర్వానంద్ గారి సినిమానా? అని అడగటంతో కొంత ఇబ్బందిపడ్డా.. ఇదంతా నాకు కొత్తగా ఉన్నా, దిల్‌రాజు గారు, బన్నీవాసు గారు మాట్లాడటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఓ పక్క సెకండ్ లెవల్‌కి వెళ్లిపోయామే అనిపిస్తుంది.. మా అమ్మాయిలు ఒకటే అన్నారు, ఇంతకుముందు అలా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదని అందరూ ఒకటే. సెకండ్ లెవల్, థర్డ్ లెవల్ అని అనుకోవద్దని చెప్పడంతో అడ్జెస్ట్ అయిపోయా. ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి.. మంచి క్యారెక్టర్స్ ఉంటే ఇవ్వండి. శర్వానంద్ గారు చాలా స్వీట్ పర్సన్. నిర్మాతలతో పాటు శర్వానంద్ గారు కూడా నన్ను హీరోగానే చూసుకున్నారు అని డాక్టర్ రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు.
.jpg)
Comments
Post a Comment