ఆదిత్యధర్ ధురంధర్ 3 తీస్తే.... సోషల్ మీడియాలో స్టోరీ, స్క్రీన్ ప్లే హల్‌చల్!
గత నాలుగు నెలలుగా భారతీయ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోన్న పేరు ధురంధర్. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ స్పై, యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. తొలి భాగం 1400 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. రెండో భాగం ఇప్పటికే 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి 2000 కోట్ల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ధురంధర్ సిరీస్ చిత్రాలు.. భారతీయ సినిమా మేకింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కథ, స్క్రీన్ ప్లే పకడ్బందీగా ఉంటే 4 గంటల నిడివ ఉన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని తేలింది.
ధురంధర్ సిరీస్ విజయవంతం కావడంతో ధురంధర్ 3 ఎప్పుడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మూడో భాగం గురించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. అయితే పార్ట్ 3 కావాలంటూ కోరుకునే వారు రోజురోజుకి పెరుగుతున్నారు. ధురంధర్ 3ని ఎటు నుంచి మొదలు పెడతారనే ఆసక్తి నెలకొంది.
ధురంధర్ 3ని సిద్ధం చేయడానికి ఎన్నో మార్గాలు చెబుతున్నారు నెటిజన్లు. ధురంధర్ ది రివెంజ్ క్లైమాక్స్‌లో జస్కిరత్ తన కుటుంబాన్ని దూరం నుంచి చూస్తాడు తప్పించి, తల్లిని చెల్లిని పలకరించడు. వాళ్లని కలుసుకుని ఇన్ని రోజులు ఏం చేసింది చెప్పడంతో పాటు జస్కిరత్ చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కుటుంబంలో ఎవరో ఒకరు ఇతనిపై పగ సాధించడం ఒకటి.
జైళ్లో ఉన్న రెహమాన్ బలోచ్ తమ్ముడు ఉరైజ్ బలోచ్ తప్పించుకుని తన అన్నయ్యతో పాటు తమ వాళ్లను చంపి, తనపై గూఢచార్యం నేరం మోపి జైలుకి పంపింది హంజానే అని తెలుసుకుంటాడు. హంజా భార్యాబిడ్డల్ని, మామ జమీల్‌ను బంధించి తిరిగి అతనిని పాకిస్తాన్‌కు రప్పించడం ఒక వెర్షన్. లేదంటే మరో కొత్త ఆపరేషన్ కోసం హస్కిరత్‌ను తిరిగి పాకిస్తాన్‌కు పంపడం వంటి వెర్షన్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆదిత్యధర్ మనసులో ధురంధర్ 3వ భాగం ఆలోచన లేనప్పటికీ సోషల్ మీడియా జనాలు మాత్రం తమకు నచ్చిన విధంగా కథలు అల్లేస్తూ.. ఎలాంటి కథ కావాలో కూడా వారే ఇస్తున్నారు.

Comments
Post a Comment