Exit Polls 2026: మమత, స్టాలిన్, హిమంతలకు మరో ఛాన్స్.. ఇద్దరు విజయ్‌లకి షాక్ తప్పదా?
ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఎక్కువ ఆసక్తిని కలిగించాయి. కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ టీవీకే పార్టీతో ఎన్నికల రణరంగంలోకి దిగడంతో తమిళనాడు ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అటు పశ్చిమబెంగాల్‌లో వరుసగా మూడు సార్లు సీఎంగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని సర్వశక్తులు ఒడ్డారు. దశాబ్ధాలుగా తమకు మింగుడుపడని బెంగాల్‌ను ఈసారి కైవసం చేసుకోవాలని బీజేపీకి కూడా గట్టిగా కృషి చేయడంతో ఇక్కడ ఫలితాలు ఎలా ఉంటాయోనని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్
234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో అధికారాన్ని అందుకోవాల్సిన మేజిక్ ఫిగర్ 118. ఈసారి కూడా డీఎంకే నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని.. స్టాలిన్ మరోసారి సీఎం అవుతారని మ్యాట్రిజ్, పీపుల్స్ పల్స్, పీ మార్క్, పీపుల్స్ ఇన్‌సైట్, ప్రజాపోల్, జేవీసీ వంటి సంస్థలు అంచనా వేశాయి. అన్నాడీఎంకే మరోసారి ప్రతిపక్షం తప్పదని సర్వేలు తేల్చాయి.
ఇక కొత్తగా పార్టీ పెట్టిన దళపతి విజయ్ మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ అధికారం కష్టమేనని తేల్చాయి. రెండంకెల స్థానాలతో టీవీకే మూడో స్థానంలో ఉంటుందని పేర్కొన్నాయి. అయితే ఎన్డీటీవీ- యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం.. దాదాపు 120 స్థానాలు గెలుచుకుని టీవీకే అధికారాన్ని అందుకుంటుందని అంచనా వేసింది.
పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్
294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అధికారాన్ని అందుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 148. హోరాహోరీగా జరిగిన బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీదే విజయమని ఎక్కువ సంస్థలు అభిప్రాయపడ్డాయి. అయితే బీజేపీ గట్టి పోటీ ఇచ్చి అధికారానికి చేరువగా రావొచ్చని మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి.
కేరళ ఎగ్జిట్ పోల్స్
140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో అధికారానికి అందుకోవాల్సిన మేజిక్ ఫిగర్ 71. మరోసారి సీఎంగా గెలిచి హ్యాట్రిక్ అందుకోవాలన్న పినరయి విజయన్‌కు షాక్ తప్పదని అన్ని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఎల్డీఎఫ్ కూటమి ఓటమి పాలై.. యూడీఎఫ్ విజయాన్ని అందుకుంటుందని, అలాగే బీజేపీ ఈసారి కేరళలో ఖాతా తెరిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు పేర్కొన్నాయి.
అసోం ఎగ్జిట్ పోల్స్
అస్సాంలో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని మెజారిటీ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సారథ్యంలోని బీజేపీ- ఏపీజీ- బీపీఎఫ్ కూటమి 100 స్థానాలు గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ కూటమి 24 స్థానాలకు పరిమితమై మరోసారి ప్రతిపక్షంతో సరిపెట్టుకోవాల్సిందేనని సర్వేలు తెలిపాయి.
పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్
30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారాన్ని అందుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 17. ఈసారి కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి ఎన్ రంగస్వామి సీఎం అవుతారని ఎగ్జిట్ పోల్స్ అంచానా వేశాయి. ఎస్‌పీఏ కూటమి 12 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితం అవుతుందని సర్వేలు తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాషాయ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మరి సర్వేలు వేసిన అంచనాలు నిజమవుతాయో లేదో తెలియాలంటే మే 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

Comments
Post a Comment