దిగ్గజాల సరసన రామ్ పోతినేని..!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. ఏడేళ్ల క్రితం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆయన మళ్లీ హిట్ కొట్టలేదు. తర్వాత చేసిన రెడ్, రొమాంటిక్, ది వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజప్పాయింట్ చేశాయి. దీంతో రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్ధితి నెలకొంది. ఇప్పటికే యంగ్ టాలెంట్‌తో పాటు సీనియర్ హీరోల నుంచి రామ్ పోతినేనికి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో తన 23వ సినిమాకు సంబంధించి ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు.
దేవదాసు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు రామ్ పోతినేని. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రామ్.. ఎనర్జిటిక్ హీరో, చాక్లెట్ బాయ్‌గా అభిమానుల్లో స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. రెడీ, మస్కా, కందిరీగ, రేయ్, నేను శైలజ, హైపర్, ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్ వంటి హిట్స్‌తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 20 ఏళ్ల కెరీర్‌లో అనుకున్నంత స్థాయిలో ఆయన సక్సెస్ కాలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ పోతినేని.. తన 23వ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటి వరకు నటుడిగా, గాయకుడిగా, గేయ రచయితగా తన టాలెంట్ చూపించిన ఆయన కెరీర్‌లో తొలిసారిగా మెగా ఫోన్ పట్టనున్నారు. మే 15న తన పుట్టినరోజును పురస్కరించుకుని RAPO 23 పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్ లెదర జాకెట్‌తో వెనుక నుంచి చూపిస్తూ స్టైలీష్ లుక్‌లో అదరగొట్టేశారు. ఈ సినిమాలో ఆయన వీర అనే క్యారెక్టర్‌ను పోషించనున్నారు. జూన్‌లో సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లి డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
అయితే ఈ సినిమాతో రామ్ అరుదైన ఘనతను అందుకోనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులుగా మారిన హీరోల లిస్ట్‌లో ఆయన చేరనున్నారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ కృష్ణ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వంటి దిగ్గజాలు హీరోలుగా నటిస్తూనే మెగా ఫోన్ పట్టి తమ అభిరుచి మేరకు సినిమాలకు దర్శకత్వం వహించారు. అన్న ఎన్టీఆర్ సీతారామ కళ్యాణంతో మొదలుపెట్టి శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వరకు దాదాపు 15 సినిమాలకు దర్శకత్వం వహించారు.
ఇక సూపర్‌స్టార్ కృష్ణ సింహాసనం మూవీతో మొదలుపెట్టి ఈశ్వర్ అల్లా తేరే నామ్ వరకు దాదాపు 17 సినిమాలకు దర్శకత్వం వహించి అత్యధిక సినిమాలను డైరెక్ట్ చేసిన హీరోగా ఘనత వహించారు. అలాగే దర్శకుడిగా తెలుగు తెరకు తొలి 70 ఎంఎం, తొలి డీటీఎస్ వంటి టెక్నాలజీలను పరిచయం చేశారు నట శేఖర కృష్ణ. అంతేకాదు.. ఏక కాలంలో తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాలను డైరెక్ట్ చేసిన శెభాష్ అనిపించుకున్నారు కృష్ణ.
ఎన్టీఆర్, కృష్ణల తర్వాత నుంచి చాలామంది తెలుగు అగ్రనటులు దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఎవరూ సాహసం చేయలేకపోయారు. మధ్యలో నట సింహం బాలకృష్ణ నర్తనశాల పేరుతో పౌరాణికాన్ని తెరకెక్కించేందుకు మెగా ఫోన్ పట్టినప్పటికీ ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాలతో అర్ధాంతరంగా నిలిచిపోయింది.
వీరి తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సాహసం చేశారు. జానీ సినిమాతో మెగా ఫోన్ పట్టారు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు పవన్ కళ్యాణ్. 2003 ఏప్రిల్ 25న విడుదలైన జానీ మూవీ అభిమానులను నిరాశపరిచింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రయత్నాన్ని విశ్లేషకులు సైతం మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ మేకోవర్, జానీ కర్చీఫ్‌లు, బనియన్స్, రిబ్బన్స్, బెల్టులతో మార్కెట్‌లో ప్రభంజనం సృష్టించారు పవన్.
పవన్ కళ్యాణ్ తర్వాత కొన్నాళ్ల వరకు తెలుగులో మరే హీరో కూడా మెగా ఫోన్ పట్టలేదు. ఈ జనరేషన్‌లో మాస్ దా కాస్ దాస్ విశ్వక్‌సేన్ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరో సినిమా సెట్స్ మీదుంది. సిద్ధూ జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టిలు స్క్రిప్ట్, డైరెక్షన్ విషయాలలో జోక్యం చేసుకుంటున్నా.. ఫుల్ టైం డైరెక్టర్లు కాలేదు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే మెగా ఫోన్ పట్టుకోనున్నారు.
అయితే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ పోతినేని దర్శకుడిగా మారుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. తన సోదరుడు చైతన్య కృష్ణ నిర్మాణంలో తన 23వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు రామ్. దీనికి స్వయంగా ఆయనే కథ అందిస్తుండటం విశేషం. ఓ సినిమాలో నటిస్తూ.. దానికి దర్శకత్వం వహించడం, స్క్రిప్ట్, మిగిలిన పనులు చూసుకోవడం అంతా కత్తిమీద సాములాంటి వ్యవహారమే. అయితే దీని కోసం రామ్ పోతినేని అన్ని రకాలుగా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరి దర్శకుడుగా ఈ ఎనర్జిటిక్ హీరో ఎంత మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
.jpg)
Comments
Post a Comment