IPL 2026 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... పోరాడి ఓడిన గుజరాత్

 

Photo Courtesy: RCBTweets

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (ఐపీఎల్ 2026) విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. విరాట్ కోహ్లీ 75 పరుగులు, జితేష్ శర్మ 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. ఒక్కొక్కరిగా పెవిలియన్ చేరారు. దాంతో గుజరాత్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ జట్టును ఆదుకున్నాడు. 37 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 

గుజరాత్ బ్యాట్స్‌మెన్‌లలో సాయి సుదర్శన్ 12, శుభమన్ గిల్ 10, నిషాంత్ సింధు 20, జోస్ బట్లర్ 19, వాషింగ్టన్ సుందర్ 50, అర్షద్ ఖాన్ 15, రాహుల్ తేవాటియా, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్‌లు తలో 7 పరుగులు, రబాడా 3 పరుగులు చొప్పున నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హేజల్‌వుడ్‌లు తలో 2 వికెట్లు పడగొట్టగా.. రషిక్ సలామ్ దర్ 3, కృనాల్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టారు.

156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓపెనర్ విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్‌లు శుభారంభం అందించారు. వీరిద్దరూ బౌండరీల వర్షం కురిపించడంతో బెంగళూరు లక్ష్యం దిశగా పరుగులు తీసింది. అయితే 32 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్‌ను మొహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. ఆ వెంటనే దేవదత్ పడిక్కల్ 1 పరుగుకే వెనుదిరిగాడు. విరాట్, కెప్టెన్ రజత్ పాటిదర్‌లు కాసేపు గుజరాత్ బౌలర్లకు ఎదురు నిలిచారు. ఈ దశలో 15 పరుగులు చేసి రజత్‌ను రషీద్ ఖాన్ ఔట్ చేశాడు.

ఆ కాసేపటికే కృనాల్ పాండ్యాను రషీద్ ఖాన్ ఎల్‌‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపడంతో 4 వికెట్లు కోల్పోయి బెంగళూరు కష్టాల్లో పడింది. ఈ దశలో టిమ్ డావిడ్ - విరాట్ కోహ్లీల జోడీ సమయోచితంగా ఆడి 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను అర్షద్ ఖాన్ విడదీశాడు. 24 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద టిమ్ డావిడ్ పెవిలియన్ చేరాడు. దీంతో వికెట్ కీపర్ జితేష్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ జట్టును విజయం దిశగా నడిపించాడు. 

చివరిలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. మ్యాచ్ నానాటికీ ఉత్కంఠగా మారుతున్న దశలో విరాట్ కోహ్లీ క్యాచ్ రూపంలో ఔట్ కావడంతో మైదానం ఒక్కసారిగా నిశ్శబ్ధంగా మారింది. అయితే టీవీ రిప్లయ్‌లో బంతి నేలను తాకినట్లుగా కనిపించడంతో థర్డ్ ఎంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో బతికిపోయిన కోహ్లీ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కోహ్లీ విరోచిత బ్యాటింగ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి ఐపీఎల్ 2026 విజేతగా నిలిచింది. 

ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌లలో వెంకటేష్ అయ్యర్ 32, విరాట్ కోహ్లీ 75, దేవదత్ పడిక్కల్ 1, రజత్ పాటిదర్ 15, కృనాల్ పాండ్యా 1, టిమ్ డావిడ్ 24, జితేశ్ శర్మ 11 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్, కసిగో రబాడా, అర్షద్ ఖాన్‌లు తలో వికెట్ పడగొట్టగా.. రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. 



Comments