తమిళనాడులో టీవీకే చరిత్ర... ఎన్టీఆర్ సరసన దళపతి విజయ్
యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉదయం నుంచే రాజకీయ విశ్లేషకులు, ప్రజలకు షాకిచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో డీఎంకే మరోసారి అధికారాన్ని గెలుచుకుంటుందని, స్టాలిన్ సీఎం అవుతారని అంచనా వేశాయి. అన్నాడీఎంకే మరోసారి ప్రధాన ప్రతిపక్షంగా మారుతుందని వెల్లడించాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే చెప్పుకోదగ్గ స్థానాలను గెలుచుకుంటుంది తప్పించి అధికారం కష్టమేనని అంచనా వేశాయి.
కానీ మే 4వ తేదీ ఉదయం ఎన్నికల ఫలితాలు ప్రారంభమైన గంటలోనే వెలువడిన ఫలితాలు షాకిచ్చాయి. అధికారాన్ని అందుకుంటుంది అనుకున్న డీఎంకే మూడో స్థానానికి, అన్నాడీఎంకే రెండో స్థానానికి పరిమితం కాగా.. ఎవ్వరూ ఊహించని విధంగా టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో అధికారాన్ని అందుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ (118). ఈ కథనం రాసే సమాయానికి టీవీకే 105, ఏఐఏడీఎంకే 71, డీఎంకే 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో తమిళనాడులో హంగ్ ఏర్పడే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకేతో టీవీకే పొత్తు పెట్టుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఈ స్థాయి ఫలితాలతో దళపతి విజయ్ చరిత్ర సృష్టించారు. సినిమా వాళ్లు రాజకీయాలకు తారుమారు చేయగలరని ఆయన నిరూపించారు. అంతేకాదు.. సినీ పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రి కాబోతున్న వ్యక్తిగా.. కరుణానిధి, అన్నాదురై, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి దిగ్గజాల సరసన చేరనున్నారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం నాటి రోజులను దళపతి విజయంతో పోల్చి చూస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమను మూడు దశాబ్ధాలకు పైగా రారాజులా ఏలిన ఎన్టీఆర్ తన సినీ జీవితానికి స్వస్తి పలికి.. ప్రజల కోసం రాజకీయాల్లోకి దిగారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేపట్టారు. చైతన్య రథంపై ఊరువాడా తిరుగుతూ.. నాటి కాంగ్రెస్ పాలనపై వాడి వేడి విమర్శలు చేశారు. ప్రధానంగా తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఎన్టీఆర్ దెబ్బకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్రతిహతంగా సాగుతోన్న కాంగ్రెస్ పాలనకు చెక్ పడింది.
1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 294 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 201 స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించగా.. కాంగ్రెస్ పార్టీ 60, సీపీఎం 5, సీపీఐ 4, బీజేపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్.. భారత రాజకీయాల్లోనే ఈ ఘనత సాధించిన తొలి నేతగా రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా అన్నగారు నిలిచారు.
తన సంక్షేమ పథకాలు, పాలనతో టీడీపీని ఒక బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంతో పాటు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీగా నిలబెట్టారు ఎన్టీఆర్. 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యతో దేశమంతా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీ గాలి వీచింది. ఉమ్మడి ఏపీలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను నాటి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కూటమి 35 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాలకే పరిమితం కావడం రాజకీయ వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది.
1983, 1985, 1994లలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్.. తెలుగు రాజకీయాలను సమూలంగా మార్చేశారు. 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ప్రజల వద్దకే పాలన, ఆడపడుచులకు ఆస్తిలో హక్కు, పటేల్- పట్వారి వ్యవస్ధ రద్దు వంటి చారిత్రాత్మక పథకాలు ఎన్టీఆర్‌ను దేవుడిని చేశాయి. రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ రామారావు తనదైన ముద్రవేశారు. కాంగ్రెసేతర పక్షాలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్‌గా నామకరణం చేసి... దానికి ఛైర్మన్‌గానూ వ్యవహరించారు.
ఇక విజయ్ విషయానికి వస్తే.. మూడు దశాబ్ధాలకు పైగా సినీ జీవితాన్ని ప్రజల కోసం పక్కనపెట్టి రాజకీయాల్లోకి దిగారు విజయ్. 2009 జూలైలో తమిళనాడు వ్యాప్తంగా ఉన్న తన 85000కు పైగా అభిమాన సంఘాలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి దానికి విజయ్ మక్కల్ ఇయక్కమ్ అని నామకరణం చేశారు. 2011లో ఈ అసోసియషన్.. అన్నాడీఎంకేకు అండగా నిలవడంతో నాటి ఎన్నికల్లో జయలలిత ఘన విజయం సాధించారు. అయితే తన బలాన్ని పరీక్షించాలని అనుకున్న విజయ్.. 2021లో తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగి 169 స్థానాల్లో పోటీ చేసి 115 స్థానాల్లో గెలుపొందారు.
ఈ క్రమంలో 2024 ఫిబ్రవరి 2వ తేదీన ఆ అసోసియేషన్‌ను తమిళగ వెట్రి కజగం (టీవీకే) అనే పేరుతో రాజకీయ పార్టీగా మార్చారు విజయ్. అదే ఏడాది అక్టోబర్ 27న విల్లుపురంలో జరిగిన పార్టీ తొలి ప్లీనరీకి దాదాపు 10 లక్షల మంది హాజరు కావడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చేతిలో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వచ్చిన విజయ్.. జన నాయగన్ చిత్రంతో తన నట జీవితానికి వీడ్కోలు పలుకుతున్నట్లు మలేషియాలో ప్రకటించారు.
కరూర్ తొక్కిసలాట, సంగీత విడాకుల నోటీసులు, జన నాయగన్ సినిమా వాయిదా వంటి వివాదాలు చుట్టుముడుతున్నా తట్టుకుని నిలబడ్డారు విజయ్. డీఎంకే, అన్నాడీఎంకేల అంగబలం, అర్ధ బలం ముందు తాను సరిపోనని తెలిసినప్పటికీ, ఒంటరిగానే బరిలోకి దిగుతానని.. ఎవరి జెండా మోయనని విజయ్ బలంగా సంకేతాలు పంపారు. ఎంతో శ్రమించి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు సాగించారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో డీఎంకే మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. కానీ ఒకే ఒక్క సర్వే మాత్రం విజయ్‌దే విజయమని తేల్చిచెప్పింది. చివరికి ఆ అంచనాను నిజం చేస్తూ విజయ్ విజిల్ మోగించారు. అన్న ఎన్టీఆర్ మాదిరిగానే పార్టీ పెట్టిన కొంతకాలానికే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు విజయ్. హంగ్ అసెంబ్లీ పరిస్ధితులు కనిపిస్తుండటంతో విజయ్ ఎవరితో జట్టు కడతారు? పవర్ షేరింగ్ ఎలా అన్నది ఆసక్తిగా మారింది.
.jpg)
Comments
Post a Comment