విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోరం... 8 మంది కార్మికులు మృతి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కుద్రవం లీకై 8 మంది కార్మికులు దుర్మరణం పాలవ్వగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంట్‌లోని ఎస్ఎంఎంస్ 2, ఎస్‌టీసీ -3 హీట్ ఎఫ్‌జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
పేలుడు జరిగిన సమయంలో దాదాపు 1500 డిగ్రీల వేడితో ఉన్న స్టీల్ మెటల్ లిక్విడ్‌ను లిఫ్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పేలుడు శబ్ధం వినిపించగానే భయాందోళనలకు గురైన కార్మికులు, ఇతర ఉద్యోగులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్, ఇతర అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాద విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అటు హోంమంత్రి అనిత కూడా విజయనగరంలో తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని విశాఖకు బయల్దేరారు.

Comments
Post a Comment