తమిళనాడు ఎన్నికలు: టీవీకేకు ఊహించని దెబ్బ.. పోటీకి ముందే విజయ్‌కి తొలి ఓటమి

 


మూడు దశాబ్థాలకు పైగా సినీ కెరీర్‌ను పక్కకుపెట్టి తమిళ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయ రంగంలోకి దిగారు కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించిన ఆయన రాజకీయాల్లో దూకారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. బీజేపీ, కాంగ్రెస్‌ల పొత్తు ఆఫర్లను కూడా కాదని ద్రవిడ రాజకీయ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకేలను ఒంటరిగా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు దళపతి. తమిళనాడు, పుదుచ్చేరిలలో మొత్తం స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టారు విజయ్. అనంతరం ప్రచారంలో దూసుకెళ్తున్నారు టీవీకే చీఫ్. ఈ క్రమంలో పోటీకి ముందే తమిళనాడు ఎన్నికల్లో విజయ్‌కి తొలి ఓటమి ఎదురైంది.

ఎడప్పాడి శాసనసభ స్థానానికి టీవీకే తరపున అరుణ్ కుమార్ అనే వ్యక్తికి టికెట్ కన్ఫర్మ్ కాగా.. ఆయన అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ల పరిశీలన సందర్భంగా అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రపోజర్ల వివరాలు సరిగా లేకపోవడంతో ఆ నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో టీవీకే శ్రేణులు షాకయ్యాయి. 

ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఏదైనా ఇబ్బంది తలెత్తితే సేఫ్ సైడ్‌గా ఉంటుందనే ఉద్దేశంతో మరో ప్రత్యామ్నాయ అభ్యర్ధిని కూడా టీవీకే నిలబెట్టింది. అయితే అతని నామినేషన్ వివరాలు కూడా సరిగా లేకపోవడంతో దానిని ఎన్నికల అధికారి తిరస్కరించడంతో విజయ్ పార్టీ శ్రేణులు ఖంగుతిన్నాయి. 

విజయ్ పార్టీ తరపున అభ్యర్ధి లేకపోవడంతో ఎడప్పాడిలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఇక్కడి నుంచి తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి బరిలో ఉన్నారు. వరుసగా ఆరోసారి విజయం కోసం పళనిస్వామి ఎదురుచూస్తున్నారు. డీఎంకే నుంచి సీ కాశీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోటీ చేయకుండా తమిళనాడు ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోవడంతో టీవీకే కేడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. 

తొలి నుంచి ఎడప్పాడి నియోజకవర్గం తమిళనాడులోని వీవీఐపీ స్థానాల్లో ఒకటికావడం విశేషం. ఇక్కడి నుంచి ఎడప్పాడి పళనిస్వామి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో తొలిసారిగా ఏఐఏడీఎంకే అభ్యర్ధిగా బరిలో నిలిచిన పళనిస్వామి విజయం సాధించారు. 1991లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి గెలిచారు. ఆ తర్వాత 1996లో హ్యాట్రిక్‌పై కన్నేసిన పళనిస్వామికి అనూహ్యంగా షాక్ తగిలి, ఏకంగా మూడో  స్థానానికి పరిమితమయ్యారు. నాటి ఎన్నికల్లో పీఎంకేకి చెందిన ఐ గణేశన్ విజయం సాధించారు.

2001లో పోటీ చేయని పళనిస్వామి.. 2006లో బరిలో దిగగా మరోసారి షాక్ తగిలింది. ఈసారి ఆయన రెండో స్థానంలో నిలిచారు. నాటి ఎన్నికల్లో పీఎంకేకు చెందిన వీ కావేరి విజయం సాధించారు. అయితే 2011 నుంచి ఎడప్పాడిలో పళనిస్వామి హవా మొదలైంది. 2011, 2016, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పళనిస్వామి.. జయలలిత ఆకస్మిక మరణంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా హ్యాట్రిక్ సాధించిన పళనిస్వామికి ఈసారి కూడా విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. 


Comments