సవాల్.. పోటీ.. దాటేశాం : జీసీసీ ఏర్పాటులో బెంగళూరును టేకోవర్ చేసిన హైదరాబాద్

 




భారతదేశంలో ఐటీ రంగానికి సంబంధించినంత వరకు బెంగళూరు, హైదరాబాద్‌లు ప్రధాన కేంద్రాలుగా అలరారుతున్నాయి. ఈ రెండు నగరాల్లో లక్షలాది మంది ఐటీ రంగంలో ఉపాధి పొందుతున్నారు. అలాగే ఐటీ ఎగుమతుల ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థకు కూడా ఈ రెండు దక్షిణాది నగరాలు తోడ్పాటును అందిస్తున్నాయి. ఏళ్ల పాటు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా నిలిచిన బెంగళూరుకు గత కొద్దినెలలుగా హైదరాబాద్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఐటీ సంస్థల ఏర్పాటుతో పాటు స్టార్టప్ కల్చర్ విషయంలోనూ బెంగళూరు దూకుడుతో దేశంలోని మరే ఇతర నగరం కూడా పోటీ పడేది కాదు. 

మారుతున్న కాలమాన పరిస్ధితులు, అధిక జీవన వ్యయం, ఆఫీస్ స్పేస్ పరంగా బెంగళూరు కంటే హైదరాబాద్ చౌకైన నగరం కావడంతో ఇప్పుడు ప్రపంచ స్థాయి సంస్థల చూపు భాగ్యనగరంపై పడింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కూడా ఒక కారణం . తద్వారా హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను, బహుళ జాతి సంస్థలను ఆహ్వానిస్తోంది. మంత్రి కేటీఆర్ ఏ సదస్సులోనైనా, ఏ అంతర్జాతీయ వేదికపై నైనా హైదరాబాద్‌కు వున్న అనుకూలతలు , తమ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను తెలియజేస్తూ పెట్టుబడిదారులను ఆలోచింపజేస్తున్నారు. దీనికి తోడు బెంగళూరు కిక్కిరిసిపోవడం ట్రాఫిక్ సమస్యలు, మౌలిక సదుపాయాల సమస్యలు కూడా హైదరాబాద్‌కు వరంలా మారాయి. 

దేశంలోని దాదాపు సగం గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ)లు కన్నడ రాజధానిలోనే వున్నాయి. కానీ పరిస్ధితులు మారుతూ వుండటంతో ఇప్పుడు ఇండియాలో జీసీసీలను ఏర్పాటు చేయాలని కంపెనీలు భావిస్తున్నా.. ఆ స్థాయి ప్రమాణాలు , పరిస్ధితులు బెంగళూరులో వుండటం లేదని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు.. ఈ ఏడాది ప్రథమార్థం నాటికి దేశంలో ఏర్పాటు చేసిన జీసీసీల సంఖ్య, విస్తరణల విషయంలో బెంగళూరును హైదరాబాద్ అధిగమించినట్లు ఎవరెస్ట్ గ్రూప్ అనే సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. 

2023 ఆరంభంలో బెంగళూరులో 13 జీసీసీలు ఏర్పాటైతే, హైదరాబాద్‌లో ఈ సంఖ్య 23కి చేరుకుంది. అలాగే బెంగళూరులో 8 కొత్త సెటప్‌లు, హైదరాబాద్‌లో 7 సెటప్‌లు వున్నాయి. జీసీసీల విస్తరణలో హైదరాబాద్‌లో నాలుగు, బెంగళూరులో 3 వున్నాయి. బెంగళూరులో పర్యావరణ అనుకూలతలు వుంటే, హైదరాబాద్‌లో కొత్త తరం అందుబాటులో వుందని నిపుణులు చెబుతున్నారు. 

ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ, బిట్స్ పిలానీ వంటి విద్యాసంస్థల ద్వారా హైదరాబాద్‌లో ప్రతిభకు డోకా లేదని అంటున్నారు. ఐటీ, ఫైనాన్స్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ సహా వివిధ పరిశ్రమలు వృద్ధి చెందడానికి ప్రతిభావంతులు అందుబాటులో వుండటం కారణమంటున్నారు. ప్రతిభ , ఆకర్షణీయమైన వేతనాల విషయంలోనూ బెంగళూరుకు హైదరాబాద్ పోటీ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెడుతూ పరిశ్రమల స్థాపనకు ఊతం అందిస్తోంది. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్ పార్క్‌లు, సెజ్‌లను రాష్ట్రమంతటా విస్తరిస్తోంది. ఈ కృషి ఫలితంగానే .. బెంగళూరును కాదని హైదరాబాద్‌పై బహుళజాతి సంస్థల చూపు పడుతోంది.  


Comments