తమిళనాడు : ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందా..?

 



ఉత్తరాది పార్టీగా ముద్రపడిన బీజేపీ తనకు కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాదిలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. కర్ణాటకలో బలమైన నాయకత్వం, కేడర్ వుండగా.. మిగిలిన రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పుదుచ్చేరిలలో పట్టు పెంచుకోవాలని పావులు కదుపుతోంది. గత లోక్‌సభ ఎన్నికల నుంచి తెలంగాణలోనూ పార్టీకి ప్రజాదరణ దక్కుతోంది. 

AliExpress WW

నాలుగు లోక్‌సభ స్థానాలతో పాటు దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయాలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అసాధారణ ప్రదర్శనతో పార్టీకి ఊపొచ్చింది. కాస్త కష్టపడితే తెలంగాణలో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేం కాదని ఫిక్స్ అయ్యింది.  అయితే గత తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బండి సంజయ్‌ని తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించి బీజేపీ వ్యూహాత్మక తప్పిదం చేసిందని విశ్లేషకులు అంటున్నారు.

AliExpress WW

అయినప్పటికీ 8 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి చాలా చోట్ల రెండవ స్థానంలో నిలిచి భవిష్యత్‌పై గట్టి ఆశలు పెట్టుకుంది. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌పైనా కమలనాథులు గట్టిగానే ఫోకస్ చేశారు. ఈసారి ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేనలతో కలిసి పోటీ చేస్తోంది. ఇక్కడ పార్టీ నిలదొక్కుకోవడానికి చాలా కాలమే పడుతుందని అంచనా. బలమైన ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలను ఎదుర్కొని నిలబడటం అంత ఆషామాషీ కాదు. అందుకే ప్రస్తుతానికి పొత్తులతో పార్టీని పట్టిష్టం చేయాలని బీజేపీ భావిస్తోంది. 

ఇదిలావుండగా.. దక్షిణాదిలోని తమిళనాడులో బీజేపీ రాజకీయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజకీయ దిగ్గజాలైన జయలలిత, కరుణానిధిలు మరణించడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. జయ మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ అన్ని రకాలుగా ఆదుకుంది. పలు ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి కమలనాథులు పోటీ చేశారు. ఇదే సమయంలో అన్నామలై రాకతో కేడర్ కూడా నూతనోత్సాహంతో పనిచేస్తోంది. వినూత్న కార్యక్రమాలు, తన వాగ్థాటితో ఆయన చొచ్చుకెళ్తున్నారు. 

తమిళనాడులోని 39 స్థానాలు, పుదుచ్చేరితో పాటు మొత్తం 102 లోక్‌సభ స్థానాల్లో ఎక్కువ భాగం ఏప్రిల్ 19న మొదటి విడతలోనే పోలింగ్ జరగనుంది. గడిచిన ఆరు దశాబ్ధాలుగా తమిళ రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీలలో దేనితోనూ పొత్తు లేకుండా భారతీయ జనతా పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో బరిలో దిగింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో తమిళనాడులో తనకంటూ ప్లేస్ ఏర్పాటు చేసుకోవడానికి , ద్రావిడ భావజాలానికి భిన్నంగా మూడో శక్తిగా ఎదగాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాశీ - తమిళ సంగమం, పార్లమెంట్‌లో ‘‘సెంగోల్ ’’ (దండం) స్థాపన వంటి సాంస్కృతిక అనుసంధాన కార్యక్రమాల ద్వారా ఈ వ్యూహం అమలు చేస్తున్నారు.

పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే), తమిళ్ మనీలా కాంగ్రెస్ (టీఎంసీ), అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే), ఇతర ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆసక్తికరంగా టీఎంసీ, పీఎంకే నేతలైన జీకే వాసన్, అన్బుమణి రామదాస్ ఇద్దరూ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పనిచేశారు. బీజేపీ 23 స్థానాల్లో , పీఎంకే 10, టీఎంసీ 3, ఏఎంఎంకే 2 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. మాజీ సీఎం పన్నీర్ సెల్వం స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. భారతీయ జననాయక కచ్చి, పుతియ నీది కచ్చి, తమిళగ మున్నేట్ర కజగం నుంచి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు అభ్యర్ధులు బీజేపీ గుర్తుపైనే పోటీ చేయనున్నారు. 

తమిళనాడులోని ఉత్తర ప్రాంతాలలో గణనీయమైన ప్రభావాన్ని కలిగి వున్న వన్నియార్ కమ్యూనిటీ మద్ధతుతో గతంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు మిత్రపక్షంగా వ్యవహరించిన పీఎంకే ప్రత్యేక స్థానం వుంది. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా వున్న మాజీ సీఎం పళనిస్వామి .. పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించడంతో అన్నాడీఎంకే పలు తిరుగుబాట్లను చవిచూసింది. 

జయలలితకు అసలైన వారసుడిని తానేనని నిరూపించుకోవాలని ఓపీఎస్ చూస్తున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు లోక్‌సభ ఎన్నికలకు పరీక్షగా భావించి బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైనప్పటికీ రామనాథపురం నియోజకవర్గం నుంచి పన్నీర్ సెల్వం స్వతంత్రంగానే పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే .. పన్నీరు సెల్వం పేరున్న మరో నలుగురు అభ్యర్ధులు కూడా పోటీ చేస్తుండటంతో ఇక్కడ విచిత్ర పరిస్ధితి నెలకొంది. 

మరోవైపు ముఖ్యమంత్రి , డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఇండి కూటమి రాష్ట్రంలో బలంగా వుంది. ప్రస్తుతం కాంగ్రెస్ చేతుల్లో వున్న వున్న పుదుచ్చేరి సహా మొత్తం 40 స్థానాలను క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే 22 స్థానాల్లో , కాంగ్రెస్ 9, సీపీఎం, సీపీఐలు చెరో రెండు, విడుతలై చిరుతైగల్ కచ్చి ఒకచోట, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి. కొంగునాడు మక్కల్ కచ్చి నుంచి ఒకరు డీఎంకే టికెట్‌పై పోటీ చేస్తున్నారు. 

తమ ప్రభుత్వ చేస్తున్న కృషి, ప్రత్యేకించి మహిళా సాధికారితకు అమలు చేస్తున్న కార్యక్రమాలు ఈ త్రిముఖ పోటీలో తమ పార్టీ, కూటమి అభ్యర్ధులు విజయం సాధించేందుకు పునాది వేస్తాయని స్టాలిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. డీఎంకే అంచనా ప్రకారం.. అన్నాడీఎంకే నుంచే గట్టి పోటీ ఎదురవుతుంది. మోడీ సహా పలువురు బీజేపీ అగ్రనేతల పర్యటనలు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని ఆయన విశ్వసిస్తున్నారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కే . అన్నామలై ఆరు నెలల సుదీర్ఘ ‘‘ఎన్ మన్ , ఎన్ మక్కల్ (నా నేల, నా ప్రజుల) వాకథాన్ ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు. అన్నామలై కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్ ట్రాక్ రికార్డును గమనిస్తే.. ఈ నియోజకవర్గం తొలి నుంచి అన్నాడీఎంకేకు పెట్టని కోటగా వుంది. 

అయితే 1998లో బీజేపీకి చెందిన సీపీ రాధాకృష్ణన్ కోయంబత్తూరులో గెలిచారు. 2021లో బీజేపీ ఈ అసెంబ్లీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడం గమనార్హం. ఈ పారిశ్రామిక నగరం నుంచి రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి యువతను ఆకర్షించేలా మోడీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు స్టాలిన్, రాహుల్ గాంధీలు రంగంలోకి దిగారు. ఏప్రిల్ 12న కోయంబత్తూరులో వీరిద్దరూ ర్యాలీ నిర్వహించనున్నారు. 



Pepperfry [CPS] IN

Comments