దూరదర్శన్ ‘‘ లోగో ’’కు కాషాయ రంగు.. ప్రసార భారతి కాదు, ప్రచార భారతి అంటూ విపక్షాల ఫైర్

 



భారత ప్రభుత్వ రంగ టెలివిజన్ సంస్థ దూరదర్శన్ లోగో మార్పు వ్యవహారం దేశ రాజకీయాల్లో దూమారం రేపింది. లోగో రంగు రూబీ ఎరుపు నుంచి కాషాయ రంగు మారడమే దీనికి కారణంగా. దూరదర్శన్ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. లోగో మార్పుపై దూరదర్శన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేసింది. ‘‘ మా విలువలు అలాగే నిలిచివుంటాయి, మేం ఇప్పుడు కొత్త అవతారంలో అందుబాటులోకి వచ్చాం, గతంలో ఎన్నడూ లేనివిధంగా వార్తలు వీక్షించేందుకు సిద్ధంగా వుండండి. అత్యంత వేగవంతంగా వార్తలు అందిస్తాం ’’ అని సందేశాన్ని వుంచింది.

Also Read : అయోధ్యలో రామయ్య నుదిటిన ‘‘సూర్య తిలకం ’’ .. ప్రతి శ్రీరామనవమికి ఎలా సాధ్యం..?

దీనిపై ప్రసార భారతి మాజీ సీఈవో, టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ భగ్గుమన్నారు. దూరదర్శన్ తన చారిత్రక ఫ్లాగ్‌షిప్‌ లోగోను కాషాయ రంగులోకి మార్చింది. సంస్థ మాజీ ఉద్యోగిగా తాను ఈ కాషాయీకరణను వ్యతిరేకిస్తున్నాను.. ఇది ప్రసార భారతి కాదు, ప్రచార భారతి అంటూ జవహర్ సర్కార్ సెటైర్లు వేశారు. దీని మాదిరిగానే కొత్త పార్లమెంట్‌ భవనంలోని రాజ్యసభ ఛాంబర్‌కు, పాత భవనానికి కాషాయ రంగు పూయడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. 

కాంగ్రెస్ సైతం దూరదర్శన్ లోగో రంగు మార్పుపై స్పందించింది. స్వయం ప్రతిపత్తి వున్న ప్రభుత్వ సంస్థలపై నియంత్రణ సాధించేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని మండిపడింది. ఇది దూరదర్శన్ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నమంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అయితే దీనిపై ప్రసార భారతి సీఈవో గౌరవ్ ద్వివేది స్పందిస్తూ.. లోగో మార్పును సమర్ధించుకున్నారు. దృశ్య సౌందర్యాన్ని మరింత పెంచేందుకే లోగో రంగును మార్చామని ఆయన స్పష్టం చేశారు. ఛానెల్ బ్రాండింగ్, విజువల్ ఈస్తటిక్స్ ఆధారంగా రంగును ఎంపిక చేశామని.. లోగోతో పాటు డీడీ ఛానెల్ లుక్, ఫీల్‌ను సైతం అప్‌గ్రేడ్ చేశామని ద్వివేది స్పష్టం చేశారు. కొత్త లైటింగ్, ఎక్విప్‌మెంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. 

Also Read : యూఏఈ : దుబాయ్‌లో వరదలా , ‘‘ క్లౌడ్ సీడింగ్ ’’ అంత పని చేసిందా ..?

కాగా.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1959 సెప్టెంబర్ 15న తొలిసారిగా దూరదర్శన్ సేవలు భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. అనంతరకాలంలో దీనిని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కిందకి తీసుకువచ్చి, జాతీయ బ్రాడ్‌కాస్టర్ హోదా ఇచ్చారు. తర్వాతి రోజుల్లో డీడీ నెట్‌వర్క్ కింద అనేక ఛానెళ్లను తీసుకొచ్చారు. ప్రస్తుతం దూరదర్శన్‌లో ఆరు జాతీయ, 17 ప్రాంతీయ ఛానెల్స్‌ నడుస్తున్నాయి. గతంలోనూ డీడీ లోగోను పలుమార్లు మార్చారు. నీలం, పసుపు, ఎరుపు రంగుల్లో ఈ లోగో కనిపించింది. 


Comments