తిరుమలకు పోటెత్తిన భక్తులు , 3 కిలోమీటర్ల మేర క్యూ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు

 


తిరుమల గిరులు భక్త జనంతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో పాటు మరికొద్దిరోజుల్లో వేసవి సెలవులు ముగియనుండటంతో తిరుమలకు భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి నారాయణగిరి షెడ్లు కిక్కిరిసిపోయాయి. రింగ్ రోడ్ నుంచి అక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. 

శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోందని.. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నట్లు టీటీడీ చెప్పింది. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు వచ్చే నెల 30 వరకు వారాంతపు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. 

మరోవైపు.. ఆగస్ట్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఉదయం 11 గంటలకు టికెట్లను విడుదల చేశారు. 

ఇదిలావుండగా .. తిరుమల శ్రీవారి ఆలయానికి ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ పెరిగిపోతోంది. జీవితంలో ఒక్కసారైనా ఆ దివ్యమంగళ రూపాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలనే భక్తులు తపన పడుతుంటారు. అంతేకాదు తమ శక్తికొలది శ్రీవారికి మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. గత నెలలో శ్రీ వెంకటేశ్వరుడిని దాదాపు 20.17 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. భక్తుల కానుకల ద్వారా రూ.101.63 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. 94.22 లక్షల లడ్డూలను విక్రయించగా.. 8.08 లక్షల మంది తలనీలాలను సమర్పించినట్లు దేవస్థానం అధికారులు  తెలిపారు. 


Comments