తెలంగాణలో థియేటర్లు 2 వారాలు బంద్ .. ప్రమాదంలో ‘‘ సినిమా ’’
ప్రస్తుత సమాజంలో మనిషికి వినోదాన్ని అందించే మాధ్యమాల్లో సినిమా ముందు వరుసలో ఉంటుంది. మనసుకు విశ్రాంతినిచ్చేది, ఆహ్లాదాన్ని పంచేది, చైతన్య పరిచేది సినిమానే. మీ హామీ ఏంటని ఎవరినైనా అడిగితే టక్కున చెప్పేది సినిమా గురించే . వీకెండ్‌లో కుటుంబం మొత్తం ఖచ్చితంగా సినిమాకు వెళ్లాల్సిందేనంటే మనిషి జీవితంలో సినిమా పాత్రను అర్ధం చేసుకోవచ్చు.
బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి నేటి వరకు సినిమా ఎన్నో మార్పులకు గురైంది. 365 రోజులూ ప్రజలకు వినోదాన్ని అందించే సినిమా థియేటర్ మూతపడిన సందర్భాలు చాలా తక్కువే. కానీ కరోనా సమయంలో రోజులకు తరబడి వెండితెరను కప్పే ఉంచాల్సి వచ్చింది. కోవిడ్ సమయంలో పరిశ్రమ అత్యంత గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంది.
అయితే తిరిగి అలాంటి పరిస్ధితే తెలుగునాట కనిపించనుంది. గడిచిన కొన్నినెలలుగా టాలీవుడ్‌లో పెద్ద సినిమాలేవి విడుదల కావడం లేదు. ఓ పక్క ఎన్నికలు, మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా దర్శక నిర్మాతలు సినిమాను విడుదల చేయాలంటే భయపడిపోతున్నారు. స్టార్ హీరోల సినిమాలు రాకపోవడంతో ప్రేక్షకులు థియేటర్ వైపు కన్నెత్తి చూడటం లేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో ప్రేక్షకులు రాకపోవడంతో వాటి యజమానులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. వేసవి ముగిసేవరకు అంటే ఓ రెండు వారాల పాటు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ శుక్రవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. కానీ దీని వల్ల చిన్న సినిమాలు తీవ్రంగా నష్టపోనున్నాయి. దాదాపు 450 సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి తెలిపారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పట్టణాల్లో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు.. హైదరాబాద్‌లో రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఖర్చు అవుతుందని ఆయన వెల్లడించారు. కానీ ప్రస్తుతం చిన్న సినిమాల కారణంగా రోజుకు రూ.4 వేలు కూడా రావడం లేదని విజయేందర్ రెడ్డి వెల్లడించారు. థియేటర్లు మూసివేయడం వల్ల రోజుకు దాదాపు రూ.4 వేలే నష్టం వస్తుందని.. అది సినిమా ప్రదర్శిస్తే రూ.6 వేల వరకు నష్టం వస్తుందని ఆయన పేర్కొన్నారు.
స్క్రీనింగ్‌లను నిలిపివేయాలన్న నిర్ణయం కనీసం రెండు వారాలపాటు అమల్లో వుంటుందని.. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేశామని విజయేందర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఎవరైనా నిర్మాతలు ముందుకు వచ్చి వ్యాపార లావాదేవీగా ముందస్తు చెల్లింపులు చేస్తే థియేటర్ల యజమానులు సినిమాలను ప్రదర్శించేందుకు సిద్ధంగా వుంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ప్రముఖులు స్పందించి సమస్యను పరిష్కరించకుంటే సినిమా మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments
Post a Comment