ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాదెండ్ల.. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 22న తుదిశ్వాస విడిచారు. భాస్కరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. 

1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు.. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయవాదిగా పట్టా అందుకున్నారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో గెలుపొంది ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ  తర్వాత మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అనంతరం తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు.. తెలుగుదేశం పార్టీని స్థాపించడంలో కీలకపాత్ర పోషించిన భాస్కరరావు.. కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. 1983లో వేమూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించిన ఆయన.. ఎన్టీఆర్ కేబినెట్‌లో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో ఎన్టీఆర్ తర్వాత శక్తివంతమైన నేతగా గుర్తింపు తెచ్చుకుని రాష్ట్ర రాజకీయాలను శాసించారు.

అయితే 1984లో నాదెండ్ల భాస్కరరావు రాజకీయ జీవితం అనూహ్య మలుపు తిరిగింది. సీఎం ఎన్టీఆర్ వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన సమయంలో గవర్నర్ రామ్ లాల్ మద్ధతుతో ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అయితే ఎన్టీఆర్ తిరిగి భారతదేశానికి చేరుకుని రాజకీయ, ప్రజా సంఘాల మద్ధతుతో పోరాటానికి దిగి తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దాంతో కేవలం నెల రోజుల పాటు నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు. 

ఈ పరిణామాలతో టీడీపీ నుంచి నాదెండ్ల భాస్కరరావును సీఎం ఎన్టీఆర్ బహిష్కరించారు. దాంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు భాస్కరరావు. 1989 ఎన్నికల్లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1998లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్న భాస్కరరావు.. 2019లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. 

నాదెండ్ల భాస్కరరావు వారసుడిగా ఆయన తనయుడు నాదెండ్ల మనోహర్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ప్రారంభించిన మనోహర్.. తెనాలి నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గా, స్పీకర్‌గా పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుని పోవడంతో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. 2024లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నాదెండ్ల మనోహర్... చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 



Comments