ఫలితాలకు ముందే దళపతి విజయ్ అలర్ట్... టీవీకే విజేతలకి క్యాంప్ రెడీ!
దేశవ్యాప్తంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ఎన్నికలు ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. అన్నింటిలోకి తమిళనాడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. అధికారాన్ని నిలబెట్టుకోవాలని డీఎంకే.. పవర్ అందుకోవాలని ఏఐఏడీఎంకే.. తొలి ఎన్నికల్లోనే జైత్రయాత్ర సాగించాలని దళపతి విజయ్‌లు బరిలోకి దిగడమే దీనికి కారణం. దాంతో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ముక్కోణపు పోటీ నెలకొనడంతో పాటు భారీగా పోలింగ్ నమోదైంది.
అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించాయి. బలమైన అభ్యర్ధులను రంగంలోకి దించి ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ఎండల్ని లెక్కచేయకుండా అగ్రనేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. చివరి వరకు సర్వశక్తుల్ని ఒడ్డటంతో గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమిళనాడులో డీఎంకేదే విజయమని చెబుతుండగా.. కొన్ని సంస్థలు హంగ్ వచ్చే పరిస్ధితి కూడా ఉందని అంచనా వేయడంతో అన్ని పార్టీలు కౌంటింగ్‌కు ముందే క్యాంప్ రాజకీయాలకు తెరదీశాయి. తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్న టీవీకే అధినేత దళపతి విజయ్... కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో విజయ్ అప్రమత్తమయ్యారు. నేతలు చేజారిపోకుండా, ప్రలోబాలకు లొంగిపోకుండా ముందుజాగ్రత్తగా తమ పార్టీ అభ్యర్ధులను రిసార్ట్స్‌కు తరలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
మహాబలిపురం సమీపంలోని పూంజేరి వద్ద ఉన్న ఒక లగ్జరీ ప్రైవేట్ రిసార్ట్ మొత్తాన్ని టీవీకే పార్టీ బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా బస చేసే సదుపాయాలు అందులో ఉన్నాయట. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత టీవీకేకు చెందిన కీలక నేతలతో విజయ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హంగ్ అసెంబ్లీ వచ్చే పరిస్ధితులు కనిపిస్తుండటంతో ఎన్నికల్లో గెలిచినట్లు అధికారులు ప్రకటించిన వెంటనే.. విజేతలంతా రిసార్ట్‌కు చేరుకోవాలని విజయ్ ఆదేశాలు జారీ చేశారు.
మరి తమిళనాడులో హంగ్ అసెంబ్లీ వస్తుందా? విజయ్ కింగ్ మేకర్‌గా మారతారా? లేక సింగిల్ పార్టీకే ఏకపక్షంగా తమిళనాడు ప్రజలు అధికారాన్ని కట్టబెడతారా? అనేది తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.
.jpg)
Comments
Post a Comment