దేశ, విదేశాల్లోని శక్తివంతమైన వ్యక్తులు ఏకమవుతున్నారు.. నేను ఓడిపోవడమే వారి లక్ష్యం : మోడీ

 


లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కర్ణాటకలోని చిక్కబళ్లాపురాలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. తనను అధికారంలో నుంచి తొలగించేందుకు దేశ , విదేశాల్లోని వ్యక్తులు చేతులు కలిపినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. కానీ నారీ, మాతృశక్తుల ఆశీర్వాదంతో వారితో పోరాడగలుగుతున్నానని ఆయన పేర్కొన్నారు. 

విపక్ష ఇండియా కూటమిలో దిశానిర్దేశం చేసేందుకు ఒక్క నాయకుడూ లేడని మోడీ ఎద్దేవా చేశారు. అందులోని భాగస్వామ్య పక్షాలకు ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ లేదని, వారి చరిత్రా అంతా స్కామ్‌లతో నిండివుందని ప్రధాని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి దశ పోలింగ్ ఎన్డీయేకు అనుకూలంగా సాగిందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. 90 ఏళ్ల వయసులోనూ జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ ఉత్సాహం, నిబద్ధత తనలో స్పూర్తి నింపినట్లు ప్రశంసించారు. 

Also Read : 'ప్రతీకారం' తప్పదు .. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగిన ఇరాన్ సుప్రీం లీడర్ , ఎవరీ అయతుల్లా అలీ ఖమేనీ ..?

అంతకుముందు మహారాష్ట్రలోని నాందేడ్, హింగోలి లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధుల తరపున మోడీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మోడీ విమర్శలు గుప్పించారు. వయనాడ్‌లోనూ రాహుల్ ఓడిపోతారని.. ఈసారి ఆయన మరో సురక్షితమైన సీటు వెతుక్కోవాలని మోడీ సెటైర్లు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక కొందరు ఇండియా కూటమి నేతలు రాజ్యసభకు వెళ్తున్నారంటూ సోనియా గాంధీని ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు ప్రధాని. 


Comments