'ప్రతీకారం' తప్పదు .. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగిన ఇరాన్ సుప్రీం లీడర్ , ఎవరీ అయతుల్లా అలీ ఖమేనీ ..?
సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడికి కారణమైన ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్‌లతో దాడికి దిగింది. చరిత్రలో తొలిసారిగా తన భూభాగం నుంచే ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగింది. ఇజ్రాయెల్‌పై వందలకొద్దీ క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. శనివారం రాత్రి టెల్ అవీవ్, పశ్చిమ జెరూసలేం సహా ఇజ్రాయెల్ అంతటా ఎయిర్ రైడ్ సైరన్‌లు మోగాయి.
Also Read : MSC Aries : ఇజ్రాయెల్ కుబేరుడి కార్గో షిప్‌ను సీజ్ చేసిన ఇరాన్ .. బందీల్లో కేరళ వ్యక్తి
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టీవ్ కావడంతో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లలో కొన్ని నేలకూలాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై పడింది. ఇజ్రాయెల్ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా పరిగణించారు. ‘‘ ఇజ్రాయెల్ శిక్షించబడాలి ’’ అని హెచ్చరించారు. ఈ క్రమంలో అసలు ఇంతకీ ఎవరీ ఖమేనీ అని నెటిజన్లు తీవ్రంగా శోధిస్తున్నారు.
Also Read : ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం : చమురు ధరలు పైపైకేనా, భారత్‌పై ప్రభావం ఎంత..?
అయతుల్లా అలీ ఖమేనీ 1989 నుంచి ఇరాన్‌లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడు. ఆయన కమాండర్ ఇన్ చీఫ్, దేశాధినేత. ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నేరుగా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తుంది. ఇది ఇరాన్ అంతర్గత భద్రతను పర్యవేక్షిస్తుంది. దీని వాలంటీర్ శాఖ అయిన బసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్ కూడా ఖమేనీ కిందే వుంటుంది.
అయతుల్లా అలీ ఖమేనీ గురించి కీలక విషయాలు :
1. అయతుల్లా అలీ ఖమేనీ జూలై 16, 1939న ఖొరాసన్ ప్రావిన్స్‌లోని మషాద్‌లో జన్మించారు. ఇస్లామిక్ పండితుడు సయ్యద్ జావద్ ఖమేనీకి ఆయన రెండవ సంతానం. సయ్యద్ తన కుటుంబ సభ్యులకు సరళమైన జీవితాన్ని బోధించాడు.
2. అలీ ఖమేనీ ప్రాథమిక పాఠశాల విద్య తర్వాత మషాద్‌లోని థియోలాజికల్ సెమినరీలో తన విద్యను కొనసాగించాడు. ఐదేళ్ల కాలంలోనే తర్కం, తత్వశాస్త్రం, ఇస్లామిక్ చట్టంతో పాటు ఇంటర్మీడియట్ స్థాయి పాఠ్యాంశాల్లోని ప్రతి అంశాన్ని అధ్యయనం చేశాడు.
3. కోమ్‌లో అధునాతన మతంలో తన అధ్యయనాలను ప్రారంభించిన ఖమేనీ.. రుహోల్లా ఖమేనీ వంటి ప్రసిద్ధి షిలి ప్రొఫెసర్ల మార్గదర్శకత్వంలో పెరిగారు. 1960, 1970లలో ఆయనను పలుమార్లు నిర్బంధించగా.. చాలా ఏళ్లు జైలులోనే గడిపారు. ఈ సమయంలో సేవక్ సీక్రెట్ పోలీసులు ఖమేనీని తీవ్రంగా హింసించారు.
4. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇస్లామిక్ తత్వశాస్త్రం, ప్రవక్త సంప్రదాయాలు, పవిత్ర ఖురాన్ వివరణలను మషాద్, టెహ్రాన్‌లలో బోధించడం ప్రారంభించారు. అభ్యుదయ భావాలున్న ఇరానియన్ యువత ఈ పాఠాలను మెచ్చుకున్నారు.
5. రక్షణ మంత్రిగా కొంతకాలం పనిచేసిన తర్వాత అలీ ఖమేనీ.. రివల్యూషనరీ గార్డ్స్‌కు సూపర్‌వైజర్‌గా వ్యవహరించారు. 1981లో ఆయనపై హత్యాయత్నం జరగ్గా.. దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అయినప్పటికీ కుడిచేయి పక్షవాతానికి గురయ్యాడు.
6. విప్లవ ప్రముఖల ప్రోద్బలంతో అలీ ఖమేనీ 1981లో అధ్యక్ష ఎన్నికలకు పోటీపడ్డారు. 1981 నుంచి 1989 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఇరాన్ - ఇరాక్ యుద్ధం ప్రాధాన్యతను సంతరించుకుంది.
7. 1989 నుంచి అలీ ఖమేనీ .. ఇరాన్ అత్యున్నత నాయకునిగా కొనసాగారు. ఒమన్ సుల్తాన్ ఖబూస్ తర్వాత మిడిల్ ఈస్ట్‌లో అత్యధికకాలం పనిచేసిన రెండవ నిరంకుశాధికారిగా ఖమేనీ గుర్తింపు పొందారు. షా మహమ్మద్ రెజా పహ్లీవి తర్వాత గత శతాబ్ధంలో ఎక్కువ కాలం పనిచేసిన ఇరాన్ నాయకుడిగా నిలిచారు.
8. సుప్రీం లీడర్‌గా అలీ ఖమేనీ.. న్యాయవ్యవస్థ, సాయుధ దళాలతో పాటు ఎలైట్ రివల్యూషనరీ గార్డ్‌లు, ప్రభుత్వ నియంత్రణలో వున్న మీడియాపై రాజ్యాంగపరమైన అధికారాన్ని కలిగివున్నారు.
Comments
Post a Comment