MSC Aries : ఇజ్రాయెల్ కుబేరుడి కార్గో షిప్‌ను సీజ్ చేసిన ఇరాన్ .. బందీల్లో కేరళ వ్యక్తి




 

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడికి కారణమైన ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్‌లతో దాడికి దిగింది. చరిత్రలో తొలిసారిగా తన భూభాగం నుంచే ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగింది. ఇజ్రాయెల్‌పై వందలకొద్దీ క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. శనివారం రాత్రి టెల్ అవీవ్, పశ్చిమ జెరూసలేం సహా ఇజ్రాయెల్ అంతటా ఎయిర్ రైడ్ సైరన్‌లు మోగాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టీవ్ కావడంతో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లలో కొన్ని నేలకూలాయి. 

Also Read : ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం : చమురు ధరలు పైపైకేనా, భారత్‌పై ప్రభావం ఎంత..?

ఇదిలావుండగా.. ఇరాన్ - ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ వ్యాపారవేత్తకు చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను హెలికాఫ్టర్లతో వెంబడించి ఇరాన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి. 

ఈ నౌకలో 25 మంది సిబ్బంది వుండగా.. అందులో 17 మంది భారతీయులేనని తెలుస్తోంది. లండన్ నుంచి వ్యాపారాలు నిర్వహిస్తోన్న ఇజ్రాయెలీ కుబేరుడు ఇయాల్ ఒఫర్‌కు చెందిన నౌకగా దీనిని గుర్తించారు. మరోవైపు.. సదరు నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిని విడిపించడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దౌత్యమార్గాల్లో సంప్రదింపులు ప్రారంభించినట్లుగా భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు పేర్కొన్నారు. 

Also Read : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు : ఇరాన్, ఇజ్రాయెల్‌లకు వెళ్లొద్దు.. భారతీయులకు కేంద్రం వార్నింగ్

ఇరాన్ కమాండోల చేతిలో బందీలుగా వున్న 17 మంది భారతీయ సిబ్బందిలో ఉత్తర కేరళకు చెందిన వ్యక్తి కూడా వుండటంతో అతని తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. తమ బిడ్డను క్షేమంగా తీసుకురావాలని వారు కేంద్రాన్ని కోరుతున్నారు. ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకున్న కార్గో షిప్‌లో తమ బిడ్డ శ్యామ్‌నాథ్ వున్నట్లుగా తల్లిదండ్రులు విశ్వనాథన్‌, శ్యామల దంపతులు చెబుతున్నారు. చివరిసారిగా శనివారం తాము శ్యామ్‌నాథ్‌తో మాట్లాడినట్లుగా తెలిపారు.

ఘటన జరిగిన ఒక రోజు తర్వాత షిప్పింగ్ కంపెనీ తమ ముంబై కార్యాలయం నుంచి తమకు కాల్ చేసి సమాచారం అందించిందని వారు వెల్లడించారు. ఉత్తర కేరళ జిల్లాలోని వెల్లిపారంబకు చెందిన శ్యామ్‌నాథ్ గత పదేళ్లుగా ‘MSC Aries'లో సెకండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో చివరిసారిగా స్వగ్రామానికి వచ్చినట్లుగా తల్లిదండ్రులు తెలిపారు. ఇరాన్ చేతిలో బందీలుగా వున్న సిబ్బందిలో శ్యామ్‌నాథ్‌తో పాటు పొరుగున వున్న పాలక్కాడ్ , వయనాడ్ జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా వున్నట్లు విశ్వనాథన్ చెప్పారు. 

Also Read : ఇజ్రాయెల్‌పై దాడి ప్రారంభించిన ఇరాన్.. రంగంలోకి అమెరికా , పశ్చిమాసియాలో భయం భయం

నౌక సిబ్బందిలో భారతీయులతో పాటు ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, రష్యాలకు చెందిన పౌరులు కూడా వున్నట్లు ఆయన తెలిపారు. శ్యామ్‌నాథ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటీ పర్యంతమయ్యారు. ఉద్రిక్తతల మధ్య కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ కొడుకు, అతని సహచరులను వీలైనంత త్వరగా సురక్షితంగా తీసుకురావాలని శ్యామ్‌నాథ్ తల్లిదండ్రులు కోరారు. మరోవైపు కార్గో షిప్ 'MSC Aries'లోని 17 మంది భారతీయ సిబ్బంది క్షేమ సమాచారం, ముందస్తు విడుదలను నిర్థారించడానికి టెహ్రాన్, ఢిల్లీలోని దౌత్యమార్గాల ద్వారా ఇరాన్ అధికారులను భారత్ సంప్రదిస్తోంది. 


Comments