ఇజ్రాయెల్‌పై దాడి ప్రారంభించిన ఇరాన్.. రంగంలోకి అమెరికా , పశ్చిమాసియాలో భయం భయం

 



ఇరాన్ అన్నంత పని చేసింది.. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడికి కారణమైన ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్‌లతో దాడికి దిగింది. చరిత్రలో తొలిసారిగా తన భూభాగం నుంచే ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగింది. ఇజ్రాయెల్‌పై వందలకొద్దీ క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. శనివారం రాత్రి టెల్ అవీవ్, పశ్చిమ జెరూసలేం సహా ఇజ్రాయెల్ అంతటా ఎయిర్ రైడ్ సైరన్‌లు మోగాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టీవ్ కావడంతో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లలో కొన్ని నేలకూలాయి. 

ఇరానియన్ సాల్వోలో 300కు పైగా కిల్లర్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు వున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వీటిలో 99 శాతం ఫ్రాన్స్, యూకే, అమెరికా బలగాలు నేలకూల్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ డ్రోన్లు, క్షిపణలు ఇరాన్‌తో పాటు ఇరాక్, యెమెన్‌ల నుంచి వచ్చాయని పేర్కొంది. దక్షిణ ఇజ్రాయెల్‌లో ఓ బాలిక క్షిపణి దాడిలో గాయపడిందని సైన్యం చెప్పింది. రాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) దాడిని ధృవీకరించింది. అలాగే ఈ వివాదం నుంచి దూరంగా వుండాలని అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. 

మరోవైపు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి ఘటనపై అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్‌కు రక్షణగా వుంటామని అగ్రరాజ్యాధినేత జో బైడెన్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు ఉక్కు కవచంలా వుంటామని.. ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేశామని బైడెన్ పేర్కొన్నారు. దీనికి ముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ ప్రయోగించిన దాదాపు 70కి పైగా డ్రోన్లు, మూడు బాలిస్టిక్ క్షిపణలను అమెరికా దళాలు కూల్చివేసినట్లు ఆ దేశ అధికారులు ధ్రువీకరించారు. 

Also Read : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు : ఇరాన్, ఇజ్రాయెల్‌లకు వెళ్లొద్దు.. భారతీయులకు కేంద్రం వార్నింగ్

ఇదిలావుండగా.. ఇరాన్ - ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ వ్యాపారవేత్తకు చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను హెలికాఫ్టర్లతో వెంబడించి ఇరాన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి. 

ఈ నౌకలో 25 మంది సిబ్బంది వుండగా.. అందులో 17 మంది భారతీయులేనని తెలుస్తోంది. లండన్ నుంచి వ్యాపారాలు నిర్వహిస్తోన్న ఇజ్రాయెలీ కుబేరుడు ఇయాల్ ఒఫర్‌కు చెందిన నౌకగా దీనిని గుర్తించారు. మరోవైపు.. సదరు నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిని విడిపించడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దౌత్యమార్గాల్లో సంప్రదింపులు ప్రారంభించినట్లుగా భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు పేర్కొన్నారు. 


Comments