ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం : చమురు ధరలు పైపైకేనా, భారత్‌పై ప్రభావం ఎంత..?

 


అంతా ఊహించినట్లుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి దిగింది. శనివారం రాత్రి వందలాది క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. వీటిని అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు మధ్యలోనే అడ్డుకున్నప్పటికీ.. కొన్ని మాత్రం ఇజ్రాయెల్ భూభాగంలో పడి స్వల్పంగా నష్టాన్ని కలిగించింది. ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం పూర్తి స్థాయిలో జరిగితే ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చమురు ధరలు పెరిగే అవకాశం వుందని .. వాణిజ్యానికి సైతం తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మధ్యప్రాచ్యంలో వేడెక్కుతోన్న భౌగోళిక , రాజకీయ వైరుధ్యాల కారణంగా భారతీయ మార్కెట్లు ఈ వారంలో అనిశ్చితికి గురికావొచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం కారణంగా చమురు ధరల కదలికల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం వుంది. అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్ - హమాస్ మధ్్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఏప్రిల్ 12 నుంచి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 1 శాతం పెరిగాయి. సరఫరాలో అంతరాయాల కారణంగా ఈ పెరుగుదల చోటు చేసుకుంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 90.45 డాలర్ల వద్ద స్థిరపడింది. 

Also Read : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు : ఇరాన్, ఇజ్రాయెల్‌లకు వెళ్లొద్దు.. భారతీయులకు కేంద్రం వార్నింగ్

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం వల్ల ముడిచమురు ధరలను దాదాపు ఆరు నెలల గరిష్ట స్థాయికి పంపింది. మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఓపెక్ రోజుకు 2.2 మిలియన్ బ్యారెళ్ల స్వచ్ఛంద ఉత్పత్తి కోతలను పోడిగించిన తర్వాత ఇది చోటు చేసుకుంది. ఇరాన్ దాడి విస్తృత యుద్ధానికి దారి తీసినట్లయితే, బ్రెంట్ కూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లపైనే పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

చమురు సరఫరాలో కీలకమైన వాణిజ్య మార్గమైన హార్మూజ్ జలసంధిలో ఈ పెరుగుదల అంతరాయం కలిగిస్తే.. క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లు లేదా 130 డాలర్లకు పెరగవచ్చని రాపిడాన్ ఎనర్జీ ప్రెసిడెంట్ , మాజీ సీనియర్ ఇంధన అధికారి బాబ్ మెక్‌నాలీ సీఎన్‌బీసీ వార్తాసంస్థకు తెలిపారు. 

భారతదేశం నికర చమురు దిగుమతిదారు కాబట్టి.. ధరలలో ఏదైనా పెరుగుదల ఆ దేశ ద్రవ్యలోటు, ద్రవ్యోల్భనాన్ని పెంచుతుంది. ఒక దేశం దిగుమతి చేసుకునే వస్తువులు, సేవల మొత్తం విలువ ఎగుమతి చేయబడిన వస్తువులు , సేవల మొత్తం విలువను అధిగమించినప్పుడు క్రూడ్ ధరలు భారత కరెంట్ ఖాతా లోటుపై ప్రభావం చూపుతాయి. 

Also Read : ఇజ్రాయెల్‌పై దాడి ప్రారంభించిన ఇరాన్.. రంగంలోకి అమెరికా , పశ్చిమాసియాలో భయం భయం

విశ్లేషకుల ప్రకారం.. ముడి చమురు ధరలలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల .. భారత కరెంట్ ఖాతాలో 40-50 బేసిస్ పాయింట్ల వరకు విస్తరించడానికి కారణమవుతుంది. అధిక కరెంట్ ఖాతా లోటు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేయడంతో పాటు దేశ కరెన్సీని బలహీనపరుస్తుంది. దిగుమతులను ఖరీదైనదిగా చేయడంతో పాటు అధిక ద్రవ్యోల్భణం, పేదల ప్రజల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. 

వచ్చే వారం మార్కెట్‌కు కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతల పెరుగుదల గ్లోబల్ ఈక్విటీ మార్కెట్‌లలో భయాందోళనలను , అస్థిరతను ప్రేరేపిస్తుంది. యూఎస్ బాండ్ ఈల్డ్‌లలో కదలికలు, డాలర్ ఇండెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే ముఖ్యమైన కారకాలు. భౌగోళిక రాజకీయం సంఘటనల ప్రభావంతో ముడి చమురు ధరల కదలికలను మార్కెట్ నిశితంగా పరిశీలిస్తోందని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎస్‌వీపీ టెక్నిలక్ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు.  


Comments