దళపతి విజయ్‌ సినిమాకు కష్టాలు... జన నాయగన్‌కు సుప్రీంకోర్టులోనూ షాక్

 


కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ కష్టాలు కొనసాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. సెన్సార్ సంబంధిత కారణాలతో విజయ్ చిత్రం వాయిదా పడింది. చివరి న్యాయస్థానాన్ని ఆశ్రయించినా చిత్ర నిర్మాతలకు ఊరట లభించింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు నిరాశే ఎదురైంది. 

సెన్సార్ సర్టిఫికెట్ జారీపై స్టే విధించిన మద్రాస్ హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ జన నాయగన్‌ను నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌నే ఆశ్రయించాలని తీర్పు వెలువరించింది. అలాగే ఈ నెల 20వ తేదీన జన నాయగన్ కేసుపై విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్ట్ డివిజన్ బెంచ్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజునే ఖచ్చితంగా తీర్పును వెలువరించాలని ధర్మాసనం సూచించింది.

జన నాయగన్ వివాదం ఏంటీ?

జన నాయగన్‌ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, రెబా మోనికా జాన్, సునీల్, మోనిషా బ్లెస్సీ, నిళగల్ రవి, రేవతి, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు జన నాయగన్ మూవీకి నిర్మాతలుగా వ్యవహరించారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు.

33 ఏళ్ల సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ రాజకీయాల్లోకి దిగారు దళపతి విజయ్. జన నాయగన్ తన నట జీవితంలో చివరి సినిమా అని మలేషియాలో జరిగిన ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించారు. ఇకపై ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని తెలిపారు. తమిళనాట భారీ ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్‌కి చివరి సినిమా కావడంతో కోలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలో జన నాయగన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ దీనిని మరింత పెంచేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న జన నాయగన్ విడుదల అవుతుందని కేవీఎన్ ప్రొడక్షన్ రిలీజ్ డేట్ లాక్ చేసింది. నార్త్ అమెరికాతో పాటు కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగింది. అయితే అనూహ్యంగా సెన్సార్ క్లియరెన్స్ కాకపోవడంతో సినిమా విడుదల ఆగిపోయింది. 

ఇందులోని కొన్ని సన్నివేశాలు తొలగించాలని, సంభాషణలు మ్యూట్ చేయాలని తొలుత సెన్సార్ బోర్డ్ సిఫారసు చేసింది. సీబీఎఫ్‌సీ బోర్డ్ ఆదేశాల మేరకు అవసరమైన మార్పులు చేసి మళ్లీ సెన్సార్ బోర్డ్ రివ్యూకి పంపింది కేవీఎన్ ప్రొడక్షన్స్. అయితే దీనిపై సీబీఎఫ్‌సీ బోర్డ్ నిర్ణయం తీసుకోకుండా.. రివ్యూని రివైజింగ్ కమిటీకి పంపించామని, వారే జన నాయగన్‌కు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేస్తారని సెన్సార్ బోర్డ్ అధికారులు చెప్పడంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్ట్ సింగిల్ జడ్జి జనవరి 9వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. అనంతరం జన నాయగన్‌కు సర్టిఫికేట్ జారీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. 

దీంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. సంక్రాంతి సీజన్‌లోనే జన నాయగన్ రిలీజ్ అవుతుందని ఆశించారు. కానీ అంతలోనే వీరి ఆనందం ఆవిరైంది. ఈ తీర్పుపై సెన్సార్ బోర్డ్.. మద్రాస్ హైకోర్ట్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. తమకు కొంత సమయం కావాలని.. సినిమాను రివ్యూ చేయాలని కోరడంతో జన నాయగన్ సెన్సార్ విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించడంతో పాటు తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌నే ఆశ్రయించాలని సుప్రీం తీర్పు వెలువరించింది. దీంతో విజయ్ అభిమానులు మరోసారి నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 


Comments